గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విషయంపై నియోజకవర్గంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పు డు ఇంతగా చర్చలు జరగలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. నియోజకవర్గం రాజకీయ స్వరూపం కూడా మారిపోయింది. దీంతో ఇక్కడి ప్రజలు నాని వ్యవహారాన్ని చర్చించుకుంటున్నారు. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా.. నియోజకవర్గం గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు అన్నగారు ఎన్టీఆర్ ఇక్కడ గెలిచిన విషయం తెలిసిందే. ఆనాడు ఎన్టీఆర్ ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
గుడివాడ నియోజకవర్గంలో ఉన్న అతి పెద్ద ఎన్టీఆర్ స్టేడియం ఆనాడు ఎన్టీఆర్ ఏర్పాటు చేసిందే. ఇలా.. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా? అనేది ఇక్కడి వారు చర్చించుకుంటున్న విషయం. గడిచిన 20 ఏళ్లుగా అన్నీ తానే అయి.. ఇక్కడ చక్రం తిప్పిన నాని.. తన పేరును నిలబెట్టుకునేలా మాత్రం ఒక్క పనికూడా చేయలేదు. కీలకమైన కృష్ణా నీటిని నియోజకవర్గానికి తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామన్న హామీ.. ఇప్పటికీ నాలుగు ఎన్నికలుగా మేనిఫెస్టోలో ఉంటూనే ఉంది.
అదేవిధంగా బాలికలు ప్రత్యేకంగా చదువుకునేందుకు వీలుగా ఇక్కడ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా ఆయన నెరవేర్చలేక పోయారు. ముఖ్యంగా గుడివాడ మార్కెట్‌యార్డు అభివృద్ధి కూడా పెండింగు లోనే ఉంది. గుడివాడ-మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గంలోని ఎన్నో రహదారుల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదన కూడా ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. అంటే ఒకరకంగా అభివృద్ధి పనుల విషయంలో మాత్రం కొడాలి పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీనినే ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు.
అయితే. కొడాలి నాని పేరు మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో మార్మోగుతోంది. పేకాట, క్యాసినో క్లబ్బులు, కోడి పందేల శిబిరాలు వంటి వాటిలో మాత్రం నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోందని ఇక్కడి ప్రజలే వేనోళ్ల చెప్పుకొంటున్నారు. ఎమ్మెల్యే ఈ విషయంలో రికార్డులు సాధించారని కూడా అంటున్నారు. ఎవరూ ప్రశ్నించేందుకు లేకుండా.. సోషల్ మీడియాపైనా తన ఆధిపత్యం చలాయిస్తున్నారని మేధావి వర్గాలు కూడా ఆరోపిస్తున్నాయి. సో.. కొడాలి ఇప్పటికైనా.. ఈ విషయాలు తెలుసుకుంటే.. ఓటేయాలని అడిగేందుకు కూడా సాహసించలేరని అంటున్నారు టీడీపీ నాయకులు.