2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం, తాయిలాలు పంచేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల ప్రలోభాల పర్వానికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సంసిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కట్టడికి డిజిటల్ కరెన్సీ రావాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. అంతేకాదు, రూ.1000 నోట్ల రద్దు తరహాలో రూ.500, రూ.200 నోట్లను రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర సంపదను వైసీపీ నేతలు హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ స్థాయికి వారి అక్రమాలను విస్తరించారని విమర్శించారు. జగన్ కు రాజకీయం ఓ వ్యాపారం అని, ఇటువంటి సీఎంను ఇప్పటిదాకా చూడలేదని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఓట్లు చీలకూడదనే పొత్తులు పెట్టుకున్నామని, దీంతో, 31 మందికి టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. కూటమి తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలని, అభ్యర్థి ఏ పార్టీ వారైనా ఎన్డీయే అభ్యర్థిగానే చూడాలని పిలుపునిచ్చారు. 160కి పైగా సీట్లు గెలుస్తుందని, కేంద్రంలో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజీనామా ఫేక్ లెటర్ పై చంద్రబాబు మండిపడ్డారు.