ఒకటి తర్వాత ఒకటి చొప్పున వస్తున్న సమస్యలతో గులాబీ క్యాంపస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి దానికో ఎక్స్ పైరీ డేట్ ఉన్నట్లుగా కేసీఆర్ అండ్ కో ఆరాచకాలకు ఎక్స్ పైరీ డేట్ వచ్చేసినట్లుగా తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించటం తెలిసిందే. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ తరహా వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చేలా ఉండటం గమనార్హం. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భూమిని కబ్జా చేశారంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది.
బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లో ఉన్న భూమిని కబ్జా చేస్తున్నట్లుగా నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదులో సంతోష్ తో పాటు లింగారెడ్డి శ్రీధర్ అనే వ్యక్తి మీదా కేసు నమోదు చేశారు.
సర్వే నెంబరు 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసిందని.. అయితే నకిలీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా నవయుగ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ నెల 21న దీనికి సంబంధించిన కంప్లైంట్ ను ఇవ్వగా.. ప్రాథమిక ఆధారాల్ని పరిశీలించిన పోలీసులు తాజాగా మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ మీద మరొకరి మీదా ఐపీసీ 400, 471, 447 సెక్షన్ల మీదా రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. దీనిపై సంతోష్ స్పందించలేదు. ఆయన వెర్షన్ ఏమిటో చూడాలి.