ఇటీవల అమెరికా.. ఇప్పుడు జర్మనీ.. ఈ రెండు దేశాలు కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టాయి. వాస్తవానికి ఈ రెండు దేశాల ఉద్దేశం ఒక్కటే.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పోకడలు వస్తున్నాయనేది ఈ రెండు దేశాల ప్రధాన భావన. అయితే.. ఈ రెండు దేశాలు స్పందించిన అంశాలు అంతర్గత విషయాలు కావడం గమనార్హం. దీంతో మోడీ ప్రభుత్వం ఎదురు దాడి చేసి తప్పించుకుంది. కానీ, అంతర్జాతీయంగా మోడీ ప్రభావానికి మాత్రం పెను సవాలే ఎదురు కానుందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే అమెరికా , జర్మనీలు రెండూ బలమైన దేశాలు కావడమే.
కొన్ని రోజుల కిందట.. అంటే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ముందు.. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు.. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమల్లోకి తెచ్చింది. రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని.. నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే.. దీనిపై స్పందించిన అమెరికా.. దీనిని తాము కూడా ఆక్షేపిస్తున్నామని పేర్కొంది. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం నియంతృత్వ దేశాలకు మాత్రమే చెల్లిందని.. ఇప్పుడు ఆయా దేశాలు కూడా రూటు మార్చుకుని ప్రజాస్వామ్య యుతంగా పౌరసత్వాలను ఇస్తున్నాయని పేర్కొంది.
అయితే.. దీనిని కేంద్రం తీవ్రంగా తిప్పికొట్టింది. ఇది మా అంతర్గత వ్యవహారం అంటూ వ్యాఖ్యానించింది. ఇక, ఇప్పుడు జర్మనీ కూడా.. అమెరికాలాగానే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తీవ్రంగా స్పందించింది. “భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి, కనీస ప్రజాస్వామ్య సూత్రాలు భారత్‌కూ వర్తిస్తాయి. అందరిలానే నిష్పక్షపాత, న్యాయబద్ద విచారణకు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయకుండా కూడా అతడిని విచారించవచ్చు. దోషిగా తేలనంత వరకు నేరం చేయనట్లే భావించాలనే సూత్రం కేజ్రీవాల్‌కు కూడా వర్తిస్తుంది” అని జర్మనీ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
అయితే.. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం ఎదురు దాడి చేసింది. ఇది పూర్తిగా భారత అంతర్గత వ్యవహరాలలో జోక్యం చేసుకోవడమేనని దుయ్యబట్టింది. ఎవరి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిచి ఆ దేశం చేసిన ప్రకటనపై విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కట్ చేస్తే.. ఇంత వరకు ఓకే.. మోడీ సర్కారుకు ఈ మాటలు రుచించకపోవచ్చు.. అంతర్జాతీయంగా దేశాల జోక్యం ఆయనకు మెలిపెట్టి కూడా ఉండొచ్చు. కానీ, ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు.. మున్ముందు భారత్‌కు-అంతర్జాతీయ సమాజానికి మధ్య సంబంధాలను ఏ రూపంలో మలుపుతిప్పుతాయనేది ఆసక్తిగా మారింది.