తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తయింది.
ఏపీలో మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లకు పోటీపడుతున్న టీడీపీ ఇప్పటివరకు 139 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.
13 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది.
ఇంకా 5 అసెంబ్లీ, 4 లోక్‌సభ సీట్లకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అయితే.. పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా టికెట్లు కేటాయించిన అధిష్ఠానం దేవినేని ఉమా లాంటి సీనియర్ లీడరుకు టికెట్ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిని దేవినేని ఉమా 2019 ఎన్నికలలో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అంతకుముందు 2014లో ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో నీటిపారుదల మంత్రిగా పనిచేశారు.
2019లో ఓటమి తరువాత కూడా ఆయన పార్టీకి ప్రధానమైన గొంతుకగా ఉంటూ వైసీపీపై నిత్యం విరుచుకుపడేవారు.
అయితే.. మైలవరంలో 2019లో ఉమాపై గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు టీడీపీలో చేరడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు.
దీంతో ఉమాకు అక్కడ అవకాశం పోయింది.
అయితే.. పెనమలూరు టికెట్ అయినా వస్తుందని ఆయన ఆశపడినా ఆ స్థానాన్ని సిటింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కే ఇచ్చారు.
ఉమా నందిగామ నుంచి రెండు సార్లు, మైలవరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే… ఈసారి ఆయన పోటీకి ఆసక్తి చూపలేదన్న మాట కూడా వినిపిస్తోంది.
ఆర్థికంగా బలహీనమయ్యారని.. ఆ కారణంగానే పోటీకి సుముఖత చూపలేదని తెలుస్తోంది.
ఈ విషయం ఆయన స్వయంగా చంద్రబాబుకే చెప్పారని.. దాంతో ఆయన్ను ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని చెప్తున్నారు.
అయితే… ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీకి పోటీ చేయడంకంటే టీడీపీ గెలిచాక రాజ్యసభకు వెళ్లడం బెటరని ఉమా భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే చంద్రబాబు వద్ద ఆయన ఈ ప్రతిపాదన పెట్టినట్లుగా చెప్తున్నారు.
చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ సానుకూలత వ్యక్తంచేసినట్లు టీడీపీ వర్గాల సమాచారం.