విశాఖలో సినీ ఫక్కీలో భారీ కంటైనర్ లో నిల్వ ఉంచిన డ్రగ్స్ ఉందతం సంచలనంగా మారింది. ఇంటర్ పోల్ నుంచి వచ్చిన సమాచారంతో ఒక్కసారిగా అలెర్టు అయిన సీబీఐ అధికారులు ఒక కంటైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో డ్రై ఈస్ట్ తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన డ్రగ్స్ ను గుర్తించారు. ఈ కంటైనర్ లో 25 కేజీల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నాయి. మొత్తంగా 25వేల కేజీలున్న ఈ ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ లో కొకైన్ కలిసి ఉండటాన్ని గుర్తించిన అధికారులు ఉలిక్కిపడ్డారు.
ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో.. ఇవి ఎవరికి చెందివన్న ఆరాను తీయటం షురూ చేశారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి చెందిన వారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన కంటైనర్ నౌక ఈ నెల 16 తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో విశాఖ పోర్టు టెర్మినల్ 2కు చేరుకుంది.
ఈ కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయంటూ ఇంటర్ పోల్ నుంచి సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన ఢిల్లీలోని సీబీఐ అధికారులు విశాఖలోని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంటర్ పోల్ నుంచి వచ్చిన మొయిల్ లో పేర్కొన్న కంటైనర్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని పరిశీలించగా అందులో డ్రగ్స్ పౌడర్ మిక్స్ అయినట్లుగా గుర్తించారు.
ఇంతకూ ఆ కంటైనర్ ఎవరిదన్న అంశాన్ని ఆరా తీస్తే సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరు మీద ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఈ కంపెనీకి ఎండీ కూనం వీరభద్రరావు కాగా సీఈవోగా ఆయన కొడుకు కోటయ్య చౌదరిగా తేల్చారు. దీంతో ఈ కంపెనీకి చెందిన ముఖ్య ఉద్యోగుల్ని పిలిచిన అధికారులు వారి ఎదుటన కంటైనర్ లోని ఒక్కో బాక్సులో నుంచి ఒక్కో బ్యాగు నుంచి పచ్చ రంగులో ఉన్న పౌడర్ ను నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ తో పరీక్షించారు. ఈ 20 బ్యాగుల్లోని పౌడర్ ను పరిశీలించగా.. ఇందులోకొకైన్.. మెథాక్వాలోన్.. ఓపియం.. మారిజోనా.. హాషిష్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇంత భారీగా రావటం అధికారుల్ని సైతం విస్తుపోయేలా చేస్తోంది. ఈ వ్యవహారంపై సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు.
ఇదిలా సంధ్యా ఎక్స్ పోర్ట్స్ అధినేత కూనం వీరభద్రరావు తీరు వివాదాస్పదంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. 2016లో లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళుతున్న విమానంలో తన పక్కన నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపనలు ఎదుర్కొన్నారు. ఈ ఉదంతంలో ఎఫ్ బీఐ అరెస్టు చేసింది. అనంతరం న్యూయార్క్ కోర్టులో హాజరు పర్చారు. తానా ప్రతినిధుల సాయంతో ఈ కేసు నుంచి బయటపడినట్లుగా చెబుతారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నూ వీరభద్రరావు పాత్ర ఉందని.. ఆయన నేత్రత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా కీలక ఎన్నికల వేళ వెలుగు చూసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ డ్రగ్స్ విలువ వేలాది కోట్ల రూపాయిలు ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.