కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఎన్నికల కోడ్ కూడా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కానీ, ఏపీలోని అధికార పార్టీ నేతలకు మాత్రం కోడ్ ఇంకా కూయలేదు అని విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు తన ఫొటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లను పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే ఎన్. వెంకట గౌడ పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే గౌడపై ఎన్నికల సంఘం ఫైర్ అయ్యింది. వెంకట గౌడ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఈసీ చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే గౌడపై స్థానిక ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో, వెంకట గౌడకు పోలీసులు షోకాజ్ నోటీసులు అందించారు.
ఇక, కోడ్ ను పక్కకుబెట్టి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, వాలంటీర్లను అధికారులు డిస్మిస్ చేశారు. 30 మంది వాలంటీర్లను ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మెళియాపుట్టిలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు ఓంశ్రీకృష్ణ చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు ఎం.మణికంఠను విధుల నుంచి తప్పించారు.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాకలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు మురళిని విధుల నుంచి తొలగించారు. చిత్తూరు జిల్ల జీడీనెల్లూరు నియోజకవర్గంలోని సురేంద్రనగరంలో వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి ప్రచారంలో పాల్గొన్న వాలంటీరు రఫీపై వేటు వేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మెట్టు గోవిందరెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వార్డు వాలంటీరు జె. రవిని డిస్మిస్ చేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ ప్రచారంలో కనిగిరి ఆర్టీసీ డిపో కండక్టర్ ఓబుల కొండారెడ్డి పాల్గొన్నారు. పొదిలిలో మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు కుమారుడు కృష్ణచైతన్య వెంట మల్లవరం విద్యుత్తు ఉపకేంద్రం షిప్టు ఆపరేటర్ షేక్ గౌస్ మొహియుద్దీన్ పాల్గొని ప్రచారం చేశారు. కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణతో కలిసి లక్ష్మక్కపల్లి సచివాలయ వాలంటీరు మాచర్ల మాల్యాద్రి ప్రచారం చేశారు.