ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తాజాగా సినీ నటుడు మంచు మనోజ్ కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు హీటెక్కించాయి. “సొంత కుటుంబానికే సాయం చేయని వాళ్లకు ఓటెలా వేస్తారు“ అంటూ.. హీరో మంచు మనోజ్ వ్యాఖ్యానించారు.అయితే.. ఆయన ఎక్కడా ఏ పార్టీ పేరు కానీ, ఏ నాయకుడి పేరును కానీ వినియోగించకుండానే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. ప్రస్తుతం ఏపీలో సొంత చెల్లెళ్లకు న్యాయం చేయడం లేదంటూ ప్రతిపక్షాలు వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈయననే టార్గెట్ చేసుకుని మంచు మనోజ్ ఇలా వ్యాఖ్యలు చేశారా? అనే సందేహాలు వ్యక్త మవుతున్నాయి.
ఏం జరిగింది?
తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీలో నటుడు మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్బాబుసహా ఆయన కుమారుడు మనోజ్ కూడా రాజకీయ విమర్శలు చేశారు. అయితే, ఒక పార్టీ అని కానీ, ఒక నాయకుడు అని కానీ వారు ఎక్కడా ప్రస్తావించకుండానే కామెంట్లు చేయడం గమనార్హం. ప్రజలకు సూచనలు చేస్తున్నట్టే వ్యాఖ్యలు చేశారు. “నచ్చిన వారికి ఓటు వేసుకోండి“ అని చెబుతూనే ఎవరికి వేయాలో కూడా నర్మగర్భంగా చెప్పడం గమనార్హం.
“ప్రధాని నరేంద్ర మోడీని చాలా సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. ఇద్దరూ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే.. లంచాలు తీసుకున్న డబ్బులు.. ఆ డబ్బులు తీసుకోండి. ఓటును మాత్రం నచ్చిన వారికి వేసి, భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్లడానికి సహకరించండి.” అని మోహన్ బాబు పరోక్షంగా మోడీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ.. “పదిమందినీ కలుపుకొని వెళ్లే నేతని వెతుక్కోండి. వాళ్ల ఫ్యామిలీకే హెల్ప్ చేయనివాళ్లు. వాళ్ల చుట్టుపక్కల వారికే హెల్ప్ చేయనివాళ్లు. మీకేం హెల్ప్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని.. కరెక్ట్‌గా ఎంచుకుని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే సాయంగా ఉంటుందో ఆలోచించుకుని కరెక్ట్‌గా ఓటు వేయండి. కష్టాల్లో ఉండి ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్లు ఉంటే వద్దని మీకు చెప్పను. ఆ డబ్బు ఇచ్చాడని ఓటు వేయొద్దు. డబ్బు ఇస్తే థాంక్యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్లకు ఓటు వేయండని” చెప్పారు.
కాగా, మనోజ్ జగన్‌ను నేరుగా విమర్శించకపోయినా టీడీపీకి సపోర్ట్ చేసారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఓ వైపు మోహన్ బాబు మోడీకి ఓటు వేయాలని చెబితే… మనోజ్ టీడీపీకి సపోర్ట్ చేశారని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు తండ్రీకుమారులు కూటమికి మద్దతు తెలియజేశారనే విశ్లేషణ వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ మొత్తం వైసీపీకి మద్దతు ప్రకటించింది. నేరుగా చంద్రబాబును విమర్శించిన మోహన్ బాబు.. జగన్‌తో కలిసి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జగన్ సీఎం అయిన కొద్ది రోజులకు ఆయనకు దూరమయ్యారు. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సీమలో కాక రేపుతున్నాయి.