దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు కావటం తెలిసిందే. ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో విచారణ చేపట్టేందుకు వీలుగా కోర్టు సైతం అనుమతి ఇవ్వటంతో గడిచిన రెండు రోజులుగా ఆమెను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఓవైపు తన అరెస్టు సరికాదంటూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించగా.. మరోవైపు ఈ స్కాంలో కవిత పాత్రపై ఈడీ తాజాగా ఒక నోట్ విడుదల చేసింది. అందులో తన వాదనను స్పష్టంగా వెల్లడించింది.
ఇందులోని అంశాల్ని చూస్తే.. తాము ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో సోదాలు చేశామని.. అనంతరం అరెస్టు చేసినట్లుగా అందులో పేర్కొన్నారు. సోదాల సమయంలో కవిత బంధువులు.. స్నేహితులు ఈడీ అధికారుల్ని అడ్డుకున్నారని పేర్కొంది. అంతేకాదు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపర్చామని.. 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించినట్లుగా ఈడీ నోట్ పేర్కొంది.
ఈ నోట్ లోని మిగిలిన అంశాల్ని చూస్తే..
– ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన.. అమలులో కవిత ఇతరులు ఆమ్ ఆద్మీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్.. మనీష్ సిసోడియాలతో కలిసి కుట్ర పన్నారు. మా దర్యాప్తులో ఈ అంశాలు వెలుగు చూశాయి. అనుమతులకు బదులుగా ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇవ్వటంతో కవిత భాగస్వామ్యం ఉంది.
– ఢిల్లీ మద్యం విధానం 2021-22లో రూపకల్పన జరిగింది.
అమల్లో అవినీతి.. కుట్రల ద్వారా టోకు వ్యాపారుల నుంచి కిక్ బ్యాక్ రూపంలో ఆప్ కు నిరంతరం అక్రమ నిధులు అందాయి. కవిత.. ఆమె సహచరులు ఆప్ కు ముందస్తుగా చెల్లించిన సొమ్మును రికవరీ చేయాల్సి ఉంది.
– ఇప్పటివరకు ఢిల్లీ.. హైదరాబాద్.. చెన్నై.. ముంబయి సహా దేశ వ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. ఈ కేసులో మనీశ్ సిసోడియా.. సంజయ్ సింగ్.. విజయ్ నాయర్ తో సహా 15 మందిని అరెస్టు చేశాం. ఇప్పటివరకు రూ.128.79 కోట్లను జఫ్తు చేశాం. తదుపరి విచారణ సాగుతుంది.