వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. గత ఏడాది తన కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినప్పుడు కూడా ఇలానే ఆయన హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కారు. ఇక, ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి ఆయన వ్యవహారం.. సోమవారం అర్ధరాత్రి నుంచి విశాఖ సహా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ హాట్‌గా మారింది. మరి ఏం జరిగింది? ఎందుకు ఆయన వార్తల్లోకి ఎక్కారు? అంటే..
1) ఐటీ తనిఖీలు..
ఎన్నికలకు ముందు కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఐటీ అధికారులు దేశవ్యాప్తంగా డబ్బున్న మారాజుల ఇళ్ల తలుపులు తడుతున్నారు. ఇలానే సోమవారం అర్ధరాత్రి ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి ఐటీ అధికారులు వచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విశాఖలో ఆయనకు నాలుగు చోట్ల ఇళ్లు ఉన్నాయి. వీటితో పాటు తానే నిర్మించిన ఓ అపార్ట్‌మెంటులోనూ .. ఫ్లాట్లు ఉన్నాయి. ఇవి రుషి కొండలో ఉన్నాయి. వీటిలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయనేది వార్త.
దీంతో విశాఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు కావడం, సినీ నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా కావడంతో ఆయన పై సహజంగానే ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఆయన ఇంటిపై దాడులు జరుగుతున్నాయనే వార్త. దీనికి ఆయన ఇంట్లో ఈ రోజు తెల్లవారు జాముదాకా లైట్లు వేసే ఉండడం.. బయట పటిష్టమైన వ్యక్తిగత భద్రతను ఏర్పాటు చేసుకోవడం.. ఎవరు వచ్చినా.. ఇంట్లో ఎవరూ లేరని చెప్పించడం వంటివి బలాన్ని చూకూరుస్తున్నాయి.
2) నగదు తరలింపు..
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఉన్న మధురవాడ అపార్ట్మెంట్ నుంచి సోమవారం రాత్రి.. మూడు కంటెయిన్లు.. క్యూకట్టినట్టుగా.. ప్రయాణించాయి. దీంతో ఆయన ఇంటి నుంచి ఎన్నికలకు సంబంధించి ప్రజలను ప్రలోభపరిచేలా.. నగదు, కానుకలు పంపిణీ చేసేలా.. ఇక్కడ నుంచి తరలిస్తున్నారా? అనే సందేహాలు కూడా.. విశాఖ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ విషయం తెలిసి.. మంగళవారం ఉదయమే పోలీసులు అక్కడకు చేరుకుని విచారించారు. అయితే.. సీసీ టీవీ రికార్డుల్లో ఆయా వాహనాలను తనిఖీ చేయకుండానే వదిలి వేశారని తెలిసింది, నెంబరు ప్లేట్లపైనా కాయితాలు అంటించి ఉన్నాయని గుర్తించారు. దీంతో ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఏం జరుగుతోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.