టీడీపీ, జనసేన, బీజేపీ ల మధ్య పొత్తు ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన ప్రజాగళం విజయవంతమైన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించడంతో ఈ కూటమికి మద్దతుగా ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. ఈ సభ ఇచ్చిన జోష్ తో కూటమిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు మరిన్ని ప్రజాగళం సభలను నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే మరిన్ని ప్రజాగళం సభల నిర్వహణకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో టీడీపీ వర్గాలు నిమగ్నమయ్యాయని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల జాబితా విడుదల అవకాశాలున్న నేపథ్యంలో ఆ జాబితా విడుదలైన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మే 13న పోలింగ్ ఉండడంతో ప్రచారానికి తగినంత సమయం లభించిందని కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో టీడీపీకి ముస్లిం ఓటర్లు దూరం అవుతున్నారని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షిబ్లీ భేటీ అయ్యారు. ఈ పొత్తు వల్ల ముస్లింలు కూటమికి దూరమవుతున్నారని వైసీపీ ప్రచారం చేస్తుందని చంద్రబాబు దృష్టికి షిబ్లీ తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో తాను మాట్లాడిన వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడిటింగ్ చేసి
వైసీపీ కుట్ర పన్నుతోందని చంద్రబాబు ఆరోపించారు. ముస్లిం డిక్లరేషన్ త్వరలో ప్రకటిస్తామని, తద్వారా వారిలోని అభద్రతాభావాన్ని తొలగించి పూర్తి భరోసా కల్పిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని, దూరదృష్టితో అర్థం చేసుకొని అండగా నిలవాలని షిబ్లీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని, అప్పుడు కూడా ముస్లింలకు వెన్నుదన్నుగా టీడీపీ నిలిచిందని గుర్తు చేశారు. మతపరమైన అంశాల్లో టిడిపి ఎప్పుడు జోక్యం చేసుకోలేదన్న సంగతి ముస్లింలు గుర్తించాలని చంద్రబాబు కోరారు.