ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేయడం.. రెండు నెలల్లోపే ఎన్నికలు జరగబోతుండటంతో అన్ని ప్రధాన పార్టీలూ పోటా పోటీ గా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ దాదాపుగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సైతం కొన్ని స్థానాలు మినహా చాలా వరకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఇక లేటుగా రేసులోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల 25న అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. మామూలుగా అయితే కాంగ్రెస్ గురించి ఎవరికీ పట్టింపు ఉండేది కాదు. కానీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి.. వరుస సభలు, హాట్ కామెంట్లతో మీడియా, జనం దృష్టిని ఆకర్షించడంతో కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలోనూ ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా షర్మిళ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది.. ఆమె బరిలో నిలిచేది ఎమ్మెల్యేగానా, ఎంపీగానా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఐతే తాజా సమాచారం ప్రకారం షర్మిళ కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయనుందట. ఇది వైసీపీ సిట్టింగ్ స్థానం, పైగా అక్కడ ఎంపీగా ఉన్నది జగన్, షర్మిళల చిన్నాన్న కొడుకు అవినాష్ రెడ్డి. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ మీద తీవ్ర ఆరోపణలే వచ్చాయి. ఈ హత్యకు కుట్ర చేసింది అవినాషే అని వివేకా కూతురు సునీత ఆరోపిస్తోంది. అవినాష్ మీద పోటీకి సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఇండిపెండెంట్గా లేదా కాంగ్రెస్ తరఫున పోటీకి నిలవొచ్చని ప్రచారం జరిగింది.
కానీ వాళ్లిద్దరూ పోటీకి సుముఖంగా లేరట. బదులుగా షర్మిళనే బరిలో దింపి మద్దతుగా నిలవాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా కడప ఎంపీగా షర్మిళ పోటీ చేస్తే పార్టీకి మంచి ఊపు వస్తుందని.. అక్కడ ఆమెకు విజయావకాశాలు కూడా మెండుగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారట. షర్మిళ కూడా ఇందుకు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ అని సమాచారం.