తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గవర్నర్ పదవికి ఆమె రాజీనామా చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ ప్రకారం తెలంగాణ గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.
త్వరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆమె రాజీనామా చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని కొద్ది రోజుల క్రితం తమిళిసై అన్నారు. కానీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రెండు రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకే తమిళిసై రాజీనామా చేశారన్న చర్చ ఇపుడు తెలంగాణలో నడుస్తోంది.
తమిళనాడు నుంచి లోక్ సభ బరిలో తమిళిసౌ దిగబోతున్నట్లు తెలుస్తోంది. నాడార్ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతగా తమిళిసైకి మంచి పేరుంది. దీంతో, నాడార్ ఓటింగ్ ఎక్కువగా ఉన్న చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి లోక్ సభ నియోజకవర్గాలలో ఏదో ఒక దాని నుంచి తమిళిసై పోటీ చేయబోతున్నారని టాక్ వస్తోంది. కరుడుగట్టిన బీజేపీ నేతగా పేరున్న తమిళిసై తెలంగాణలో గవర్నర్ గా దాదాపు 5 సంవత్సరాలపాటు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్న రీతిలో తమిళిసై వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నేతల విమర్శలను దీటుగా ఎదుర్కొని తమిళిసై గవర్నర్ గా తెలంగాణలో ఐదేళ్ల పాటు గవర్నర్ గా పనిచేశారు. ఇక, తాజాగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ తో తమిళిసైకి సత్సంబంధాలున్నాయి.