చిలకలూరిపేటలోని బొప్పూడిలో జరిగిన ప్రజా గళం సభలో ప్రధాని నరేంద్ర మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్… జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఓ సారా వ్యాపారి అని, ఐదేళ్లలో లక్షా 13 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే, 84 వేల కోట్లు మాత్రమే లెక్క చూపిస్తున్నారని ఆరోపించారు. దాదాపు 10 వేల కోట్ల రూపాయల జీఎస్టీ ఎగ్గొట్టారని సంచలన ఆరోపణ చేశారు.
జేపీ వెంచర్స్ మీద ఇసుక దోపిడీ చేశారని, ఐదుగురు బినామీలు ఎవరో తెలుసని షాకింగ్ ఆరోపణలు చేశారు. 40 వేల కోట్ల రూపాయల ఇసుక కుంభకోణం జరిగిందని పవన్ ఆరోపించారు. ఇసుక దోపిడీని ప్రశ్నించిన కిషన్ అనే రిపోర్టర్ ను చంపేశారని సంచలన ఆరోపణలు చేశారు. భారత్ కు డ్రగ్స్ రాజధానిగా ఏపీ మారిందని పవన్ ఆరోపించారు. ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా విదేశాల నుంచి కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెడుతుంటే ఏపీ నుంచి మాత్రం సంస్థలు జగన్ దెబ్బకు పారిపోతున్నాయని పవన్ విమర్శించారు.
వివేకా గారిని హత్య చేశారని, చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. తనను కూడా పలుమార్లు ఇబ్బంది పెట్టారని పవన్ వాపోయారు. జగన్ కు డబ్బులు ఎక్కువయ్యాయని, ఎవరి అడ్డు అదుపు లేదని విమర్శించారు. రావణాసురుడు కూడా అలాగే అనుకున్నాడని, కానీ నార చీర కట్టుకున్న శ్రీరాముడు నేలపై నిలబడి బాణంతో రావణాసురుని చంపేశాడని పవన్ చెప్పారు. నరేంద్ర మోడీ గారి రాక కోసం అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రా ప్రజానీకం ఎదురుచూస్తుందని అన్నారు. దోపిడీలతో నలిగిపోతున్న ఏపీ ప్రజలు ప్రధాని రాక కోసం వేయికళ్లతో ఎదురు చూశారని చెప్పారు.
దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని, హ్యాట్రిక్ కొట్టబోతున్న మోడీ గారికి ఏపీ ప్రజల నుంచి, జనసేన నుంచి శుభాకాంక్షలు చెబుతున్నానని పవన్ అన్నారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ పొత్తు మొదలైందని, 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు మరో రూపం దాల్చిందని పవన్ చెప్పారు. మోడీ గారి ఆశీస్సులతో 2014లో మాదిరిగానే అంతకుమించి పోయేలా 2024 లో కూడా ఘన విజయం సాధిస్తున్నామని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని చెప్పారు.