తన సోదరుడు సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా అంటూ 2019 ఎన్నికలకు వెళ్ళిన జగనన్న..2024లో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ‘సిద్ధం’ అయ్యాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టించుకోలేదని, హోదా కోసం మోడీని జగన్ ఏనాడైనా గట్టిగా నిలదీశారా అని ప్రశ్నించారు. చిన్నాన్నను చంపిన వారిని రక్షించేందుకు మాత్రం జగనన్న ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు.
తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని, పులి కడుపున పులే పుడుతుందని షర్మిల చెప్పారు. తన గుండెలో నిజాయితీ ఉందని, తన పుట్టిల్లు ఏపీలో ప్రజలకు అన్యాయం జరుగుతోంది కాబట్టే ఇక్కడ అడుగు పెట్టానని షర్మిల చెప్పుకొచ్చారు. ఏపీకి హోదా వచ్చేవరకు, పోలవరం పూర్తయ్యే వరకు, విశాఖ ఉక్కు కాపాడుకునేంతవరకు, అద్భుతమైన రాజధాని కట్టే వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల ఇక్కడ నుంచి కదలదని వ్యాఖ్యానించారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ పేరుతో విశాఖలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, షర్మిల పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు ఐదుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. వైఎస్ రాజకీయ వారసురాలు షర్మిల అని రేవంత్ అన్నారు. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని, అందుకే ఏపీకి వెళుతున్నానని షర్మిల తనకు చెప్పి వచ్చారని రేవంత్ గుర్తు చేసుకున్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని రేవంత్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్…ఎవరు గెలిచినా మోడీవైపే ఉంటారని విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్లు, జగన్ ఐదేళ్లు పరిపాలన చేసినా పోలవరం ఎందుకు పూర్తి కాలేదని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉందామని రేవంత్ పిలుపునిచ్చారు.