జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు ఐదేళ్లు పూర్తయింది. అయితే ఇప్పటివరకు ఆయనను చంపిన హంతకులకు శిక్ష పడలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ పై ఆయన సోదరి వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకాను కిరాతకంగా హత్య చేసి ఐదేళ్లు గడుస్తున్నాయని, ఆయన మరణంతో చిన్నమ్మ సౌభాగ్యమ్మ, సునీత అందరికన్నా ఎక్కువగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఇంకా శిక్ష పడలేదని భావోద్వేగంతో మాట్లాడారు.
వివేక వర్ధంతి సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో షర్మిలతో పాటు వైఎస్ సునీత, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయపోరాటం చేస్తున్న సునీతను వేధిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులను రక్షిస్తున్నారని పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. బంధువులే హత్య చేశారని అన్ని సాక్షాలు వారి వైపు చూపుతున్నాయని అయినా సరే హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదని షర్మిల వాపోయారు.
జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తోబుట్టువుల కోసం వైయస్సార్ ఎంతో చేశారని, ఆయన వారసుడైన జగనన్న ఏం చేశాడని షర్మిల ప్రశ్నించారు.