సినిమా పేరు : తంత్ర
ప్రధాన పాత్ర : అనన్య నాగళ్ల
కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : శ్రీనివాస్ గోపిశెట్టి
కో-ప్రొడ్యూసర్: తేజ్ పల్లి
నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య
విడుదల తేదీ: 15,మార్చి 2024.
హారర్ జానర్లో సినిమా విడుదలైనప్పుడు చిన్న సినిమాలు తరచుగా సవాళ్లను ఎదుర్కొంటాయి. చిన్న సినిమా చేయడానికి కష్టాలు ఎక్కువ. వాటిని విడుదల చేయడానికి ఇంకా ఎక్కువ కష్టాలు పడాలి. మరి కష్టపడితే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారా అంటే లేదనే చెప్పాలి.
వాటికి థియేటర్లు దొరకడమే మొదటి విజయం. అవి ప్రేక్షకులు నచ్చడం వాటి రెండో విజయం. ఈరోజు విడుదలైన తంత్ర మొదటి విజయాన్ని సాధించింది. మరి రెండోవిజయాన్ని సాధించిందా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే చిన్న సినిమాలకు కథే హీరో.
‘తంత్ర’ దాని ఆసక్తికర ట్రైలర్ తో ఆకట్టుకోవడం ప్రేక్షకులను అయితే కొంతవరకు థియేటర్ కు రాబట్టుకుంది. మరి ఎలా ఉంది… మెప్పించిందా అనేది చూద్దాం.
ప్లాట్:
కథ అనన్య నాగల్లా పోషించిన పల్లెటూరి అమ్మాయి రేఖ లైఫ్. ఎవరికైనా దెయ్యం పడితే లేదా చేతబడి చేస్తే అది ఆమెకు తెలుస్తుంది. తల్లి లేని అమ్మాయి. తండ్రి ప్రేమ దొరకదు. తిట్లు మాత్రం తప్పవు. తేజ (ధనుష్ రఘుముద్రి) ఆమె చిన్ననాటి స్నేహితుడు. అతను ఆమెను ఆదరిస్తాడు. ఆమె కొన్ని పనులు చూసి ఆమెకు ఎవరైనా క్షుద్ర ప్రయోగం చేసారేమో అని తేజ సందేహపడతాడు. అతనా ఆ గొడవలో ఉండగా… ఆ ఊరిని ఎప్పుడో వదిలి వెళ్లిపోయిన విగతి (టెంపర్ వంశీ) వస్తాడు. అతను వచ్చి రేఖను తన కూతురే అని చెప్తూంటాడు. అసలు రేఖ ఎవరు..ఆమెకు ఎందుకు దెయ్యాలు ఎందుకు కనపడుతున్నాయి. ఆమె తల్లి రాజేశ్వరి (సలోని) ప్లాష్ బ్యాక్ ఏమిటి… రేఖకు నిజంగానే చేతబడి ఎవరైనా చేసారా..చివరకు కథ ఎలాంటి మలుపు తీసుకుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇప్పుడు ప్యూర్ హారర్ ఫిల్మ్ లదే రాజ్యం. నికార్సయిన ఒక్క హారర్ సినిమా అయినా రాకపోతుందా అని వాటి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా చేసిందనాలి ఈ సినిమా. హర్రర్ సినిమాలు కమర్షియల్ అప్పీల్ మరియు ప్రేక్షకులకు నిజంగా భయానక అనుభవాన్ని అందించడం మధ్య బ్యాలెన్స్ చేయాలి. హారర్ సినిమా భయపెట్టకపోతే అది ఫెయిలైనట్టే. ‘తంత్ర’ అనేది మన లోతైన భయాలను వెలికితీసి, ప్రేక్షకులను మరింతగా కోరుకునేలా చేసే థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హారర్ సినిమాల జోనర్ లో వచ్చి పాపులర్ అయిన సినిమాలన్ని ఎప్పటికప్పుడు ఓ కొత్త ఎక్సపీరియన్స్ ఇచ్చినవే. ఇది కూడా అలాంటి అనుభూతిని ఇస్తుంది.
ఫస్టాఫ్ సోసోగా నడిపినా సెకండాఫ్ కు వచ్చేసరికి కథ ఊపందుకుంటుంది. హీరోయన్ తల్లి (సలోని) ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కొత్తగా అనిపిస్తుంది. బాగా డిజైన్ చేసారు. ఈ రెండు ఎపిసోడ్స్ ని నమ్ముకనే సినిమా చేసారనిపిస్తుంది. ఫస్టాఫ్ ఇంకాస్త స్క్రిప్టు బాగా చేసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.
ఏదైమైనా తొలిచిత్రానికి ఇలాంటి కాన్సెప్ట్ రాసుకున్న దర్శకుడికి.. దాన్ని నమ్మి చేసేందుకు ముందుకొచ్చిన ఆర్టిస్ట్ లకు, నిర్మాతకు చాలా ధైర్యం కావాలి. ఈ విషయంలో దర్శక నిర్మాతలిద్దర్నీ అభినందించాల్సిందే.
టెక్నికల్ గా కూడా అబోవ్ యావరేజ్ సినిమా ఇది. ఇంత చిన్న బడ్జెట్ లో సినిమాను ఇంత బాగా వర్కవుట్ చేయడం చాలా కష్టం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మనల్ని ఎంగేజ్ చేస్తుంది. కెమరా వర్క్ కూడా నేచురాలిటీ తెచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ మరింత పెంచుంటే బాగుండేది. సినిమాకు ఇంకాస్త ఖర్చు పెడితే మరింత మంచి అవుట్ ఫుట్ వస్తుందనిపిస్తుంది. డైరక్టర్ కొత్త అయినా ఆ తడబాటు ఎక్కడా కనపడదు. నటీనటుల్లో అనన్య నాగళ్ల బాగా చేసింది.
బాటమ్ లైన్ : ఇది భయపెట్టే సినిమాయే !
రేటింగ్ : 2.75 /5
????#tantrathemovie #ananyanagalla pic.twitter.com/goqnjSKjsh
— Ananya Nagalla (@AnanyaNagalla) March 14, 2024