కోడికత్తి శీను అలియాస్ జనుపల్లి శ్రీనివాసరావు…ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ దాడి సింపతీతో జగన్ సీఎం అయ్యారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. ఇక, దాదాపు ఐదేళ్ల పాటు శీను జైల్లో మగ్గుతూ ఎన్నో పోరాటాల తర్వాత ఎట్టకేలకు ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే కోడి కత్తి శీను తాజాగా రాజకీయాల్లోకి అడుగు పెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జై భీమ్ భారత్ పార్టీలో శీను చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్…శీనుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అమలాపురం నుంచి శీను పోటీ చేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఇక, పేదల కోసం, వారి అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని శీను చెప్పారు. కులమతాల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. చట్టసభల్లో తన గొంతు వినిపించి పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు రాజకీయాలలోకి వచ్చానని శీను అన్నారు.
ఇక, జగన్ సర్కారు వల్ల దగా పడిన శ్రీనివాస్ రావు దళిత రాజ్యాంగ పరిరక్షణ కోసం తపన పడుతున్నారని శ్రవణ్ కుమార్ అన్నారు. మరో వైపు, పులివెందుల నుంచి జై భీమ్ భారత్ పార్టీ తరఫున సీఎం జగన్ పై వివేక హత్య కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి పోటీ చేయబోతున్నట్టుగా శ్రవణ్ కుమార్ తెలిపారు.