సర్కారు వర్సెస్ మీడియా అన్నది కొత్తేం కాదు. నిజానికి.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా చెప్పే మీడియా ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రజల పక్షాన పోరాడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా ఎవరెంత వరకు తమ బాధ్యతల్నినిర్వహిస్తున్నారన్నది పెద్ద డిబేట్. దీని మీద ఏ కామెంట్ చేసినా.. ఎదో ఒక రంగు పూయటం ఇప్పుడో అలవాటుగా మారింది. అందుకే.. ఆ జోలికి పోకుండా.. ఏపీలోని జగన్ ప్రభుత్వానికి.. ప్రముఖ మీడియా సంస్థగా పేరున్న ఆంధ్రజ్యోతి యజమాని రాధాక్రిష్ణకు మధ్య నడుస్తున్న లడాయి అంతా ఇంతా కాదు.
ఆర్కే టీడీపీని కొమ్ము కాస్తారన్నది జగన్ అండ్ కో ఆరోపణ. అదెంత నిజమన్నది అందరికి తెలిసిందే. అయితే తాను చంద్రబాబు పక్షపాతి అన్న విషయాన్ని ఆర్కే ఒప్పుకోరు. ఒకవేళ.. నిజంగానే అయితే.. ఆయన్ను విమర్శిస్తూ కూడా రాస్తాను కదా? అని ప్రశ్నిస్తారు. ఇదే విషయాన్ని జగన్ అండ్ కోను ప్రశ్నించినప్పుడు వారిచ్చే సమాధానాలు భిన్నంగా ఉంటాయి. ఒకవేళ.. వారి వాదననే పరిగణలోకి తీసుకుంటే.. సాక్షిలో కూడా అలాంటివి ఉండాలి కదా? ఒక్కసారైనా అలాంటి పరిస్థితి ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.
రాజకీయ విభేదాలు వ్యక్తిగత అంశాలుగా మారటం ఇటీవల కాలంలో చూస్తున్నదే. తాజాగా ఏపీ సీఎం జగన్ బాబాయ్ దారుణ హత్యకు గురై రెండేళ్లు గడిచిన వేళ.. ఆయన కుమార్తె కమ్ డాక్టర్ అయిన సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాల్ని ప్రస్తావించారు.దీనికి సంబంధించిన వార్త జగన్ మీడియా సంస్థలో అయితే కనిపించలేదనే చెప్పాలి. మిగిలిన పత్రికలతో పోలిస్తే.. ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ఇచ్చారు. దీనిపై రోత రాతలంటూ జగన్ అండ్ కోమండిపడుతోంది. ఇలాంటివేళలోనే.. విజయమ్మ పేరుతో ఒక లేఖ బయటకు వచ్చింది. దీనిపై.. తాజాగా ఆర్కే తన కాలమ్ లో స్పందించారు. వివేక హత్యకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నల్ని ఆయన సంధించారు.
తాను అడిగానని అనే కన్నా.. వివేక కుమార్తె అడిగిన ప్రశ్నల్నే తాను అడుగుతున్నట్లు ఆంధ్రజ్యోతి ఎండీగా వ్యవహరిస్తున్న ఆర్కే పేర్కొన్నారు. ఇంతకూ ఆయన సంధిస్తున్న సందేహాలు సూటిగా ఉండటమే కాదు.. నిజమే.. ఇలాంటి వాటికి జగన్ అండ్ కో సమాధానం చెబితే బాగుంటుంది కదా? అన్న భావన కలిగేలా ఉండటం గమనార్హం. ఇంతకీ ఆర్కే సంధించిన సందేహాల్ని ఆయన మాటల్లోనే చూస్తే.
వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో నిగ్గు తేలాల్సిందేనన్నది తన మాట మాత్రమే కాదని, జగన్ కూడా అదే ఉద్దేశంతో ఉన్నారని విజయలక్ష్మి పేరిట విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే నిజమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిపాటు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు?
వివేకా హత్య కేసును దర్యాప్తు చేయడం కోసం చంద్రబాబు నియమించిన కమిటీలోని అధికారులు అందరినీ ఎందుకు బదిలీ చేశారో చెబుతారా?
జిల్లా ఎస్పీ మహంతిని కూడా బదిలీ చేశారు కదా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ విచారణ అవసరం లేదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
హత్య కేసులో అనుమానితుడైన శ్రీనివాసరెడ్డిది అసహజ మరణమైనా ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు?- కేసు డైరీని ఇంతవరకు పులివెందుల కోర్టు నుంచి సీబీఐకి ఎందుకు పంపలేదు? సీబీఐ విచారణను వేగవంతం చేయాలని కేంద్రాన్ని జగన్ ఎందుకు కోరడంలేదు?
నేను అడిగే ప్రశ్నలకు కాకపోయినా, మీ కుటుంబంలో ఒకరైన డాక్టర్ సునీత సంధించిన ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలి కదా! కుటుంబ పెద్దగా విజయలక్ష్మికి ఆ బాధ్యత లేదా?
జగన్ రెడ్డి ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని డాక్టర్ సునీత స్వయంగా చెప్పారు కదా! దానికేమంటారు?
అంతెందుకు, జగన్ బాబు అని ముద్దుగా పిలుచుకొనే జగన్మోహన్ రెడ్డిపై తన భర్త రాజశేఖర్ రెడ్డి అభిప్రాయం ఎలా ఉండేదో విజయలక్ష్మి చెప్పగలరా?
రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్లో చనిపోవడానికి ముందు జగన్ రెడ్డిని బెంగళూరుకే పరిమితం కావాలని ఆదేశించిన విషయం నిజం కాదా?
జగన్ చెప్పాపెట్టకుండా ఇంట్లో ప్రత్యక్షం కావడంతో రాజశేఖర్ రెడ్డి అసహనం ప్రదర్శించడం నిజం కాదా?
ఈ విషయాలు నిజం కాదని మీరు నమ్మితే, నిత్యం మీ వెంటే ఉంచుకొనే బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా విజయలక్ష్మిగారూ?
దీన్నిబట్టి కన్నతండ్రి కూడా భరించలేని వ్యక్తిత్వం జగన్ రెడ్డిది అని ఎవరైనా ఎందుకు భావించకూడదు?
వివేకానందరెడ్డి హత్య విషయానికి వస్తే, తన తండ్రి చావుకు భాస్కరరెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కారణమని స్వయంగా డాక్టర్ సునీతా రెడ్డే చెబుతున్నారు కదా!అయినా పోలీసులు ఇంతవరకు వారిద్దరినీ ఎందుకు ప్రశ్నించలేదు?
ఈ కారణంగానే సోదరుడు జగన్ రెడ్డి ప్రభుత్వంపై డాకర్ట్ సునీత విశ్వాసం కోల్పోయిన విషయం వాస్తవం కాదా?
అవినాష్ రెడ్డిపై చర్య తీసుకుంటే ఆయన భారతీయ జనతాపార్టీలో చేరిపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పడం నిజం కాదా?
జగన్ స్వభావం, మనస్తత్వం ఎలాంటివో రాష్ట్ర ప్రజలందరూ చూశారంటున్న విజయలక్ష్మి, ఆయనపై తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎందుకు చిరాకుపడేవారో చెప్పగలరా?
ప్రజలు అమాయకులు కనుక వారు జగన్‌ను నమ్ముతుండవచ్చు. కుమారుడి మనస్తత్వం ఎలాంటిదో తండ్రికి తెలుస్తుంది కదా! అందుకే జగన్‌ను దివంగత రాజశేఖర రెడ్డి కట్టడిచేసే ప్రయత్నం చేశారని ఎవరైనా అంటే కాదనగలరా?
రాజశేఖర్ రెడ్డి భార్యగా, జగన్ రెడ్డి తల్లిగా మీరు గర్వపడుతూ ఉండవచ్చు గానీ కుటుంబ వ్యవహారాల్లో మీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందన్నది నిజం కాదా విజయలక్ష్మి గారూ? తన పిల్లల మధ్య విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నిందిస్తున్న విజయలక్ష్మి, విభేదాలు లేవని బైబిల్ సాక్షిగా చెప్పగలరా?
రాజశేఖర్ రెడ్డి మరణంపై తమకు అనుమానాలు ఉండేవని చెబుతున్న విజయలక్ష్మి, ఇప్పుడు కన్నబిడ్డ అధికారంలో ఉన్నందున కనీసం విచారణ అయినా చేయించే ప్రయత్నం ఎందుకు చేయలేదో చెబుతారా?
ఆనాడు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం రాజశేఖర్ రెడ్డిని చంపించారని ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది మీ కుటుంబం కాదా?
అప్పుడు హెలికాప్టర్ ప్రమాదానికి కారకుడని మీరు నిందించిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ముఖ్యమంత్రిగా మీ కుమారుడు సాదర స్వాగతం చెప్పడాన్ని ఏమనుకోవాలి?
తనపై హత్యాయత్నం జరిగిందని ఎన్నికల ముందు గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడు కేంద్రప్రభుత్వం వద్ద తనకున్న పలుకుబడి ఉపయోగించి ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేయించలేరా?
అధికారంలోకి రావాలన్న లక్ష్యం నెరవేరింది కనుక ఇప్పుడు ఆ సంఘటన ముఖ్యమంత్రికి గుర్తుకొస్తున్నట్టు లేదు. రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును ఇన్ని ముప్పుతిప్పలు పెట్టే బదులు నిజంగా తనపై జరిగిన సోకాల్డ్ హత్యాయత్నం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉండి ఉంటే ఎన్ఐఏ ద్వారా ఆయనను అరెస్టు చేయించే శక్తి జగన్‌కు లేదా?