వైసీపీ అధినేత, సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఎవరైనా పులిని చూసి భయపడతారని, కానీ బిల్డప్ బాబాయ్ జగన్ సిద్ధం సభలో డ్రోన్ చూసి భయపడ్డాడని ఎద్దేవా చేశారు. 10 లక్షల మంది జనం వచ్చారని గ్రాఫిక్స్ లో చూపించేందుకు వీలుగా గ్రీన్ మ్యాట్లు కూడా వేశారని ఆరోపించారు. బాహుబలి చూపిస్తానని పులకేసి సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. ఇటీవల గ్రూప్ 2 పరీక్షలో ఆడుదాం ఆంధ్రా, జీవ క్రాంతి గురించి ప్రశ్నలు అడిగారని, అయితే బాబాయ్ ని లేపేసింది ఎవరు? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నది ఎవరు అన్న ప్రశ్నలు వచ్చుంటే బాగుండేదని చురకలంటించారు.
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు చూసి జగన్ భయపడుతున్నారని, అది ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని లోకేష్ అన్నారు. క్రిమినల్ రికార్డు ఉన్నంతకాలం జగన్ చరిత్రలో నిలిచి ఉంటాడని చంచల్ గూడ జైల్లో జగన్ పేరు ఉంటుందని ఎద్దేవా చేశారు. జగన్ కేసులకు సంబంధించి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో అధ్యయనం జరుగుతోంని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
కోడి కత్తి వారియర్స్ అని పేరు పెట్టి ఐపిఎల్ టీం ఏర్పాటు చేస్తారా అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. బాబాయ్ ని గట్టిగా కొట్టిన అవినాష్ రెడ్డి సీనియర్ బ్యాటర్ అని, బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అంబటి అందులో ఆటగాళ్లని ఎద్దేవా చేశారు. జగన్ ను చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తుకు వస్తాడని చురకలంటించారు.