ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీపై ఆ పార్టీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన విమర్శలు చేశారు. సీఐడీ కస్టడీలో తనను 40 నిమిషాలపాటు కస్టడీలో చితగ్గొట్టారని, మీడియాలో తన గాయాలు చూపించకుంటే పైకి పోయేవాడినని రఘురామ అన్నారు. ఇక, జగన్ ను ఓడించేందుకు ప్రత్యేకంగా వ్యూహాలు అక్కర్లేదని, జనాల్లో ఆయన చేసిన మోసాల గురించి వివరిస్తే చాలని అన్నారు.
జగన్ అవినీతిపై నాలుగు నెలల కిందట కేసు వేశానని, 40 మంది రెస్పాండెంట్స్ ఉన్నందున విచారణలో జాప్యం జరుగుతోందని చెప్పారు. రాబోయే మంగళవారం తదుపరి విచారణ ఉంటుందని అన్నారు. ఆ కేసులో 1350 పేజీలు ఫైల్ చేశారని, ఆ స్థాయిలో జగన్ అవినీతి ఉందని అన్నారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్న జగన్…ఆ తర్వాత సిగ్గు లేకుండా మాట తప్పారని దుయ్యబట్టారు. ఇదే విషయాన్ని జగన్ కు ఆయన మనుషులకు తాను చెప్పానని, అందుకే తనపై కోపం వచ్చి కక్ష సాధించారని చెప్పారు.