తెలంగాణ కాంగ్రెస్ లో మొదటి జాబితాలు 15 మంది అభ్యర్థులు ఉంటారని అందరూ లెక్కలువేసుకున్నారు. అయితే.. అనూహ్యంగా నలుగురికి మాత్రమే సీటు దక్కింది. దీంతో అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? అనే చర్చ ఆసక్తిగా మారింది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత అంతా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారని అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా అలాగే అనుకున్నారు. మొదటి అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. రెండో అభ్యర్థిగా ప్రకటించకపోయినా చేవెళ్లలో సభ పెట్టి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఓటేయాలన్నట్లుగా ప్రచారం చేశారు. మొదటి జాబితాలో పట్నం సునీత పేరు మాత్రం రాలేదు.
జహీరాబాద్ కు సురేశ్ షెట్కార్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్లగొండ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి, మహబూ బాబాద్ నుంచి బల్ రాం నాయక్ పేర్లను ఖరారు చేశారు. మిగతా స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. రాష్ట్ర కమిటీ పంపిన జాబితాలో బీఆర్ఎస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన నలుగురు పేర్లు ఉండటంతో అధిష్టానం నేరుగా రంగంలోకి దిగినట్టు సమాచారం. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధును పోటీకి దించాలని రాష్ట్ర నాయకులు నిర్ణయించారు.
అయితే, ఈ నలుగురు కూడా ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో నాలుగు పోగా మిగిలిన13 సెగ్మెంట్లలో సునీల్ కనుగోలు ద్వారా సర్వే చేయించి.. ఆ తర్వాతే టికెట్లను ప్రకటించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఇదిలావుంటే, మరోవైపు సునీల్ కనుగోలు బృందం రంగంలోకి దిగింది. అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసే పనిలో పడిందని తెలుస్తోంది. సర్వే ఆధారంగా టికెట్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది. పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్న వారి అంశాన్ని కూడా ప్రస్తావించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్టు సమాచారం.
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ లో చేరి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? గెలిచే అవకావం ఉందా..? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరికొన్ని సెగ్మెంట్లలోనూ జాయిన్ చేసుకోబోయే లీడర్ల గురించి.. ప్రస్తుత ఆశావహుల గురించి కూడా పెద్ద ఎత్తున సర్వే చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.