జగన్ ఓ 420 అంటూ ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. రాష్ట్రానికి హోదా ఇస్తానని చెప్పి మోడీ మోసం చేశారని, ఆయనో డిఫాల్టర్ అని, అందుకే ఆయనను కేడీ అని సంబోధిస్తున్నారని షర్మిల చెప్పారు. మోసగాడు అయిన మోడీకి వంత పాడుతున్న జగన్ కూడా కేడీ, మోసగాడు, 420 అని…చంద్రబాబు కూడా మోసగాడు, 420, కేడీ అని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు.
హోదా తోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, కానీ హోదా కోసం వైసీపీ, టీడీపీ పోరాడలేదని విమర్శించారు. ఏపీకి ఊపిరి వంటి హోదా కోసం జగన్ పోరాటం చేయలేదని, కన్నతల్లి వంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు పొడిచారని షర్మిల దుయ్యబట్టారు. ఇచ్చిన మాట మడత పెట్టిన జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాలేదని, హోదా కోసం పోరాడానికే వచ్చానని చెప్పుకొచ్చారు.
వైసీపీ, టీడీపీ, జనసేనలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేదని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకు పుట్టిన జగనన్నకు శ్రద్ధ లేదని, చంద్రబాబుకు అసలు లేదని షర్మిల భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టారు. షర్మిల కామెంట్లు, షర్మిల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.