వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ సీరియస్ కామెంట్లు చేశారు. “మా జిల్లా నుంచి ఒకడొచ్చాడు. వాడి పేరు పాపాల పెద్దిరెడ్డి. మా సొంత జిల్లా చిత్తూరును క్యాన్సర్ లా తినేస్తున్నాడు. అక్కడ నేను పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడికి వెళ్లినా పీఎల్ఆర్ పేరుతో టిప్పర్లు కనిపించేవి. ప్రతి టిప్పర్ లో ఇసుక, మద్యం ఫుల్. ఏకంగా గ్రావెల్ కూడా కొట్టేస్తున్నారు. అలాంటి వాళ్లను మన నియోజకవర్గానికి రానిస్తే క్యాన్సర్ గడ్డలా తినేస్తారు. ఇక్కడకు వస్తే తరిమితరిమి కొట్టండి“ అని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
తాజాగా ఆయన హిందూపురం నియోజకవర్గంలో శంఖారావం సభలను తిరిగి ప్రారంభించారు. 15 రోజుల కిందటి వరకు ఉత్తరాంధ్రలో పర్యటించిన నారా లోకేష్.. ఇప్పుడు సీమపైదృష్టి పెట్టారు. ఈ నియోజకవ ర్గంలో తన మామ, నటసింహం నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. టీడీపీ బలం కార్యకర్తలేనని, నాయకులు పార్టీ మారి వెళ్లినా కార్యకర్తలు అండగా నిలబడ్డారని కొనియాడారు.
వైసీపీ కార్యకర్తలకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కావాలని లోకేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పిలుపు మేరకు రా.. కదలిరా.. అంటే చాలు… మన కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారని వ్యాఖ్యానించారు. వీరితోపాటు వైసీపీ మంత్రులు కూడా వచ్చి పార్టీని బలోపేతం చేస్తున్నారని వ్యాక్యానించారు.
కార్యకర్తల కోసం పార్టీ ఎన్నో చేసిందని నారా లోకేష్ చెప్పారు. “2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటుచేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబాలకు 2 లక్షల బీమా అందజేసి ఆదుకున్నాం. ఇందుకు 100 కోట్లు ఖర్చుపెట్టాం. పిల్లలను చదివించలేకపోతే వారిని దత్తత తీసుకుని చదివిస్తోంది నా తల్లి. అదీ… కార్యకర్తల పట్ల మా చిత్తశుద్ధి” అని వివరించారు.
టీడీపీకి కంచుకోట అంటే గుర్తుకువచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూరమేనని నారా లోకేష్ వ్యాఖ్యా నించారు. గతంలో ఎన్టీఆర్ ని గెలిపించారని, ఇప్పుడు వరుసగా బాలయ్యను గెలిపిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఇక్కడ భారీ మెజారిటీని అందించాలని పిలుపునిచ్చారు. కాగా, రోజుకు మూడు నియోజకవర్గాల్లో నారా లోకేష్ శంఖా రావం సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.