ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గతంలో వైసీపీ మహిళా నేతగా పనిచేసిన సంగతి తెలిసిందే. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, వైసీపీ అధికార ప్రతినిధిగా వాసిరెడ్డి పద్మ తన గళాన్ని వినిపించేవారు. ప్రతిపక్ష నేతల విమర్శలను తన వాగ్దాటితో తిప్పి కొట్టేవారు. జగన్ నమ్మిన బంటుగా పద్మకు మంచి పేరుంది. అయితే, మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన నేపథ్యంలో పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలకు పద్మ దూరంగా ఉండాల్సి వచ్చింది.
వాస్తవానికి గత ఎన్నికల్లో పద్మ జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలని భావించినా కొన్ని సమీకరణాల కారణంగా ఆమెకు టికెట్ దక్కలేదు. అయితే, ఈసారి కూడా జగ్గయ్యపేట లేదా మైలవరం నుంచి వాసిరెడ్డి పద్మ టికెట్ ఆశించారు. అయితే, ఆ రెండు చోట్ల ఆమెకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో వాసిరెడ్డి పద్మ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
తాజాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి రాజీనామా చేశారు. హఠాత్తుగా పద్మ రాజీనామా చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. అంతేకాదు కాపు సామాజిక వర్గానికి చెందిన వాసిరెడ్డి పద్మ త్వరలో జనసేనలో చేరబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం తరఫున 2009లో పోటీ చేసి ఓడిపోయిన పద్మకు చిరంజీవితో మంచి పరిచయాలున్నాయి. ఈ క్రమంలోనే పద్మను జనసేనలోకి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ప్రత్యక్ష రాజకీయాలలో, ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాజ్యాంగబద్ధమైన ఈ పదవి అడ్డు వస్తుండటంతోనే ఆమె రాజీనామా చేసినట్లుగా పద్మ అనుచరులు చెబుతున్నారు. ఆమె వైసీపీలోనే కొనసాగుతారని అంటున్నారు.