కాపు నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరతారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. స్వయంగా ముద్రగడ పద్మనాభాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి కలుస్తారని జనసేన నేతలు ముద్రగడకు చెప్పారు. కానీ, ముద్రగడతో పవన్ భేటీ కాలేదు. అలా కాకపోగా తనకు సలహాలు ఇవ్వద్దంటూ పరోక్షంగా హరి రామ జోగయ్య, ముద్రగడలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ముద్రగడ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముద్రగడ వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ముద్రగడ ఇంటికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితోపాటు, మాజీ మంత్రి కన్నబాబు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సూచన ప్రకారం ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించామని తెలిపారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభంపై తమకు గౌరవం ఉందని, ఆయన పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్లు మిథున్ రెడ్డి వెల్లడించారు.
అయితే, పిఠాపురం శాసనసభ నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. ఇక, ఎన్నికల కోడ్ అమలు కాకముందే ముద్రగడకు నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారని, ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరికి పిఠాపురం టికెట్ ఇచ్చేందుకు వైసీపీ రెడీ అయిందని మరో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ముద్రగడకు మిథున్ రెడ్డి, వైసీపీ నేతలు వివరించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన వెంటనే ముద్రగడకు కీలక పదవి ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ అంగీకరించారని తెలుస్తోంది. ముద్రగడ ఈ నెల 12న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరి….సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ముద్రగడ తనయుడు గిరికి పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.