ఈ రోజు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. రెండో విడత అభ్యర్థుల జాబితాతోపాటు బీజేపీతో పొత్తు వ్యవహారంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పొత్తు కుదిరితే ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ బీజేపీకి స్థానాలు కేటాయించాలనే దానిపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బీజేపీ పెద్దలతో భేటీ అయ్యేందుకు పవన్ కల్యాణ్ బుధవానం నాడు ఢిల్లీకి వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రేపు గురువారం నాడు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. అక్కడ బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. బీజేపీకి సంబంధించి కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో, గురువారం నాడు దాదాపుగా టీడీపీతో బీజేపీ పొత్తుపై చర్చలు ఫైనల్ అవుతాయని, రేపు ఢిల్లీ వేదికగానే పొత్తుపై అధికారిక ప్రకటటన ఉండొచ్చని తెలుస్తోంది. లేదంటే చంద్రబాబు, పవన్ ఏపీకి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పొత్తుపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.