వైసీపీ అధినేత, సీఎం జగన్ తన పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలు మారుస్తున్న నేపథ్యంలో పార్టీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. చాలాచోట్ల అసంతృప్త నేతలు బహిరంగంగానే రచ్చకెక్కుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమలాపురం వైసీపీలో వర్గపోరు బయటపడింది. ఎంపీ చింతా అనురాధ, మంత్రి విశ్వరూప్ మధ్య విభేదాలు ఒక్కసారికి బట్టబయలయ్యాయి.
వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య విభేదాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమంటోందని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇక, ఆ పుకార్లకు ఊతమిచ్చేలా అమలాపురంలో ఓ ఘటన జరిగింది. స్థానిక గడియార స్తంభం కూడలి దగ్గర మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి విగ్రహాన్ని నిన్న మంత్రి విశ్వరూప్ అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా మంత్రి దాడిశెట్టి రాజాతోపాటు పలవురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రసంగించారు. అయితే, ఎంపీ అనురాధకు మైక్ ఇవ్వకుండానే విశ్వరూప్ సభను ముగించడంతో అనురాధ అలిగి అక్కడ నుంచి విసురుగా వెళ్లిపోయారు.
వాస్తవానికి చిట్టబ్బాయి విగ్రహం చుట్టూ పార్కు ఏర్పాటుకు అనురాధ రూ. 5 లక్షలు మంజూరు చేశారు. విశ్వరూప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆమె సహకరించినా..ఇలా మైక్ ఇవ్వకుండా ఆమెను అవమానించారని అనురాధ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.