ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరికల జోరు పెరుగుతోంది. తాజాగా వైసీపీకి చెందిన బీసీ నాయకుడు, మంత్రి గుమ్మనూరు జయరాం.. మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ -జనసేన `జయహో బీసీ సభ` వేదికగా టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు.
బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని గుమ్మనూరు స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… గుమ్మనూరు రాకతో టీడీపీకి కొత్త జోష్ వచ్చినట్టు ఉందన్నారు. గుమ్మనూరు జయరాం ప్రజా నాయకుడని, బీసీల్లో మంచి బలం ఉందని.. కానీ ఆయనకు టికెట్ లేకుండా జగన్ ఇబ్బందులు పెట్టారని వ్యాఖ్యానించారు. వైసీపీలో బీసీలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. గుమ్మనూరు ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. వైసీపీ నుంచి వచ్చే వారికి టీడీపీ ద్వారాలు తెరిచే ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుమ్మనూరుకు కనీసం జగన్ అప్పాయింట్ మెంటు కూడా ఇవ్వకుండా వేధించారని అన్నారు.
ఇదిలావుంటే.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న గుమ్మనూరు జయరాం.. గతంలో టీడీపీలో పనిచేశారు. అయితే.. జగన్ పిలుపుతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నాక.. జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఐదేళ్ల పాటు కొనసాగిన మంత్రుల్లో గుమ్మనూరు కూడా ఒకరు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ సూచించింది. అయితే.. తనకు అంత శక్తి లేదని.. తన అనుచరులు, కార్యకర్తలు ఎమ్మెల్యేగా నే పోటీ చేయాలని చెబుతున్నారని గుమ్మనూరు వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విన్నపాలను వైసీపీ పట్టించుకోలేదు. దీంతో గత రెండు మాసాలుగా ఆయన టీడీపీలో చర్చలు జరిపి.. చివరకు ఆ పార్టీలో చేరారు. ఆయనకు ఆలూరు లేదా.. కర్నూలు అసెంబ్లీ స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.