నేను మంచివాణ్ని అని చెప్పుకోవడం తప్పుకాదు. కానీ, తన మంచి తనాన్ని సమర్థించుకోవడం కోసం.. ఎదుటి వాళ్లను దొంగలను చేయడమే ఘోరం.. నేరం కూడా! ఇప్పుడు సాక్షాత్తూ కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇదే పని చేశారు. తరచుగా ఆమెపై ఇటీవల “షర్మిలా శాస్త్రి“ అనే కామెంట్లు వస్తున్నాయి.
దీనిని ఆమె పలు సందర్భాల్లో బహిరంగంగానే ఖండించారు. “నేను షర్మిలా రెడ్డినే“ అని చాటుకున్నారు. అంతేకాదు.. తాను క్రిస్టియన్ అని కూడా చెప్పుకొచ్చారు. ఇంతటితో కథ అయిపోతే బాగానే ఉండేది. కానీ, తన కుమారుడు రాజారెడ్డి, ప్రియల వివాహాన్ని విశదీకరిస్తూ.. చేసిన సుదీర్ఘ ప్రసంగంలో తన క్రిస్టియానిటీని సమర్థించుకునే క్రమంలో హిందువుల ఆచారాలను తూలనాడారు. ఇదే పెద్ద వివాదంగా మారుతోంది.
షర్మిల ఏమన్నారంటే..
“పసుపు. ఇది యాంటీ బయోటిక్ మాత్రమే. దీనిని హిందువులు ఓన్ చేసుకోవడం ఏంటి? దీనిని వారికేపరమితం చేయడం ఎందుకు? మనం నిత్యం చేసే కూరల్లోనూ పసుపును వాడతాం. ఇది హిందువులకే పరిమితం కాదు. దీనివెనుక ఏమీ పురాణాలు లేవు. ఇదొక వంట వస్తువు మాత్రమే. మా రాజాకు వివాహాన్ని ఘనంగా జరిపించాం. ఆదివారం ఉదయం ప్రార్థనలు చేశాం.
వచ్చిన అతిథులకు థ్యాంక్స్ చెప్పాం. ప్రభువు ప్రార్థనలు చేశాం. తలంబ్రాలు కూడా పోసుకున్నారు. తలంబ్రాల్లో ఎక్కడా బియ్యాన్ని వాడలేదు. ఓ చెంబులో నీళ్లు పోసి.. ఉంగరాలు తీయించే `ఆట ఆడించాం.` రాజానే ఉంగరం తీశాడు. ఇందులో హిందువుల సంప్రదాయం ఏముంది. నా కొడుకు పెళ్లికి పురోహితుడిని పిలవలేదు. పైగా.. ఎక్కడా బియ్యం వాడలేదు. ఒక్క మంత్రం కూడా చెప్పలేదు. అన్నీ మా సంప్రదాయం ప్రకారం చేశాం“ అని వివరించారు.
అంతేకాదు.. అప్పట్లో ప్రభువు.. ఆనాటి సంప్రదాయాలను అనుసరించి అందరికీ `వైన్` పంచేవారు. ఇది తప్పు ఎలా అవుతుంది? అప్పట్లో వైన్ చాలక పోతే.. నీటిని వైన్ గా మార్చి పంచారు. మా గుండెల నిండా ప్రభువు ఉన్నారు. మా రక్తంలో కూడా ఉన్నారు. మమ్మల్ని కోసినా ప్రభువు రక్తమే బయట పడుతుంది. మేం పూర్తిగా క్రిస్టియన్లమే“ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక, పెళ్లిలో తాను కూడా స్టెప్పులు వేశానని.. తన తల్లి విజయమ్మ కూడా కాలు కదిపారని వెల్లడించారు.
అయితే.. ఇవన్నీ బాగానే ఉన్నా.. పసుపును హిందూ సమాజం .. ఒక పవిత్ర దేవతా వస్తువుగా చూస్తుంది. ఇంట్లో ఏశుభ కార్యం జరిగినా.. మహిళలు పాదాలకు పసుపు రాసుకుంటారు. వచ్చిన పేరంటాలకు కూడా రాస్తారు. గడపలకు నిత్యం పసుపు రాసి ఆరాధిస్తారు. అలాంటి పవిత్ర వస్తువును షర్మిల అవమానించడం దారుణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.