ఈ రోజు ఆదిలాబాద్ లో ప్రధాని మోడీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రధాని హోదాలో మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలా ఉండాలని, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు కలిగి ఉన్నపుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాని అండ ఉండాలని ఆకాంక్షించారు. ఇక, ఆ సభ తర్వాత రేవంత్ రెడ్డి…రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీతో భేటీ అయ్యారు. గంటకుపైగా వీరిద్దరూ రాష్ట్ర, దేశ రాజకీయాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న అభివృద్ధి, మారిన ప్రజాపాలనలపై మాట్లాడుకున్నారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరం, భవిష్యత్తులో వ్యూహాలు, పార్టీల విధానాలపై తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
ఈ భేటీలో రేవంత్ వెంట ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రామోజీ రావును కలవడం ఇదే తొలిసారి. అనారోగ్య కారణాల రీత్యా కొంతకాలంగా రామోజీ రావు విశ్రాంతి తీసుకుంటోన్న సంగతి తెలిసిందే.