ఇచట వాహనములు నిలుపరాదు అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ఖిలాడి, హిట్-2 లాంటి సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది. గత ఆరు నెలల్లో ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి.. గుంటూరు కారం.
ఇందులో మహేష్ బాబు మరదలి పాత్రలో కనిపించింది మీనాక్షి. మరోవైపు తమిళంలో విజయ్ సరసన ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే మరో పెద్ద ప్రాజెక్టులో మీనాక్షి అవకాశం దక్కించుకుంది. ఇంకా ఆమె చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయి. తాజాగా మీనాక్షికి మరో మంచి అవకాశం లభించినట్లు సమాచారం. ఆమె సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన నటించబోతోందట.
ఈ సంక్రాంతికి ‘సైంధవ్’తో పలకరించిన వెంకీ.. త్వరలోనే అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టనున్నాడు.
ఎఫ్-2, ఎఫ్-3 తర్వాత వీరి కలయికలో రాబోతున్న మరో ఫన్ ఎంటర్టైనర్ ఈ మూవీ. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చోటుందట. ఒక కథానాయికగా మీనాక్షిని ఓకే చేసినట్లు సమాచారం. మరో పాత్రకు ఒక సీనియర్ హీరోయిన్ని అనుకుంటున్నారట. యంగ్ హీరోయిన్లు వెంకీ తరం సీనియర్ హీరోలతో జోడీ కట్టడానికి కొంచెం ఆలోచిస్తారు. కానీ మీనాక్షికి అలాంటి సమస్య లేనట్లే ఉంది. వెంకీ పక్కన ఆమె సూటైందంటే చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్లు కూడా ఆమె వైపు చూసే అవకాశముంది.
దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అతి త్వరలోనే సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారు. మీనాక్షి ప్రస్తుతం విశ్వక్సేన్ సరసన ‘మెకానిక్ రాకీ’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్‌కు జోడీగా ‘మట్కా’ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఇంకో రెండేళ్లు ఆమె డైరీ ఖాళీ లేనట్లే కనిపిస్తోంది.