డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో క్రిష్ పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చడం సంచలనం రేపింది. అయితే, తాను ఆ హోటల్ కి వెళ్ళిన మాట వాస్తవమేనని, కానీ ఆ డ్రగ్స్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్రిష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం క్రిష్ రక్తం, మూత్రం నమూనాలను తీసుకొని ఆయనను అక్కడి నుంచి పంపించి వేశారు.
వాస్తవానికి సోమవారం నాడు క్రిష్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఆయన శుక్రవారం నాడు విచారణకు హాజరయ్యారు. కొంతసేపు విచారణ జరిపిన తర్వాత శాంపిల్స్ తీసుకొని క్రిష్ ను అక్కడి నుంచి పంపించి వేశారు. ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్, కేదార్నాథ్ నమూనాల రిపోర్టులు ఆల్రెడీ పాజిటివ్ గా వచ్చినట్టు తెలుస్తోంది. హోటల్లో గతంలో చేసిన రైడ్ సందర్భంగా డ్రగ్స్ దొరకపోవడంతో ప్రధాన నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించేందుకు అనుమతి లభించలేదు.
అయితే తాజాగా లభించిన వైట్ పేపర్స్ పై కొకైన్ ఆనవాళ్ళు గుర్తించడంతో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ తో పాటు మరో నిందితుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుతో ప్రమేయమున్న 14 మంది కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపడుతున్నారు.