వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్కు ఎన్నికలకు ముందు భారీ షాక్ తగిలింది. ఆయనపై 2012లో నమోదైన అక్రమాస్తుల కేసుల్లో కదలిక వచ్చింది. ఈ కేసులు ఇప్పటి వరకు దాదాపు పదేళ్లకు పైగా పెండింగులో ఉన్నాయి. ఎలాంటి విచారణకు రాకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను తేల్చేందుకు ఏప్రిల్ 30 వరకు తెలంగాణ హైకోర్టు గడువు పొడిగించింది. అప్పటి కల్లా ఈ కేసులను కొలిక్కి తీసుకురావాలనిస్పష్టం చేసింది.
ఇక, సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ సహా నిందితులు వేసిన 130 డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టులో సుదీర్ఘ కాలంగా విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సమయంలో జగన్కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను 2 నెలల్లో ముగించాలని డిసెంబరు 15న సీబీఐ హైకోర్టు కోర్టును ఆదేశించింది. అయినప్పటికీ.. ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు.
అంతేకాదు, ఎక్కువగా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నందున ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించా లని సీబీఐ కోర్టు ఫిబ్రవరి 15న హైకోర్టును కోరింది. డిశ్చార్జి పిటిషన్లపై విచారణ తుది దశకు చేరిందని సుమారు 13వేల పేజీల డిక్టేషన్ సిద్ధంగా ఉందని సీబీఐ కోర్టు హైకోర్టుకు వివరించింది. సీబీఐ కోర్టు వినతిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, సీఎం జగన్ కేసుల విచారణ మందకొడిగా సాగుతోందని పేర్కొంటూ.. వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణరాజు గత ఏడాది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. పైగా.. ఎన్నికలకు ముందు పూర్తి చేయాలని ఆదేశించడంతో సీఎం జగన్ మరిన్ని ఉచ్చుల్లో చిక్కుకున్నట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.