ఒంగోలు వైసీపీలో కొంతకాలంగా ముసలం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని పట్టుబట్టడం…అందుకు జగన్ ససేమిరా అనడం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పై బాలినేని అలకబూనడం…వైవీ సుబ్బారెడ్డికి, బాలినేనికి మధ్య ప్యాచప్ కోసం జగన్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడం తెలిసిందే. ఈ క్రమంలోనే మాగుంటకు ఈ సారి జగన్ టికెట్ ఇవ్వడం లేదని, ఆయన టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పుకార్లకు ఊతమిస్తూ వైసీపీకి బాలినేని రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాగుంట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రకాశం జిల్లాలో మాగుంట ఒక బ్రాండ్ అని చెప్పారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం 11 సార్లు చట్ట సభలకు పోటీ చేశానని చెప్పారు. మాగుంట ఫ్యామిలీకి అహం లేదని, ఆత్మగౌరవం మాత్రమే ఉందని అన్నారు. వైసీపీని వీడటం బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని తెలిపారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలబెడతానని అన్నారు. మార్చి మొదటి వారంలో మాగుంట టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.