భారత క్రికెటర్ హనుమ విహారీ… రేపిన వివాదం ఏపీలో రాజకీయ మంటలు రేపింది. ఆంధ్ర క్రికెట్ జట్టుకు తాను ఆడేది లేదని.. ఆయన ఇన్‌స్టాలో స్పష్టం చేయడం తెలిసిందే. ఆటలో భాగంగా తాను చేసిన మందలింపు రాజకీయంగా మారి.. తనను కెప్టెన్సీ నుంచి తప్పించేలా చేసిందని విహారీ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఒక నేత వల్ల తాను హర్ట్ అయ్యాయని.. ఇక నుంచి తాను ఆంధ్రాజట్టుకు ససేమిరా ఆడేది లేదని పేర్కొన్నారు.
అయితే.. ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నుంచి బలమైన విమర్శలు వైసీపీని షేక్ చేయిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందిస్తూ.. “ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా?“ అని ప్రశ్నించారు. అంతేకాదు.. “అన్నింటిలోనూ నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు క్రీడలను కూడా వదలడం లేదు. వైసీపీ నేతల దౌర్భాగ్య రాజకీయాలకు క్రీడలను బలి చేయడమేంలి. క్రీడలు, క్రీడాకారులపై అధికారమదాన్ని చూపుతున్నారు“ అని షర్మిల నిప్పులు చెరిగారు. “ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా?“ అని షర్మిల ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇక, ఇదే విషయంపై చంద్రబాబు స్పందించారు. వైసీపీ నాయకులకు రాజకీయాలేముఖ్యమని, రాష్ట్రం ఏమై పోయినా ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు… విహారీ లాంటి అనేక మంది క్రీడాకారులను తాము తయారు చేశామని.. ఇప్పుడు వైసీపీ వారిని అవమానించి.. రాష్ట్రానికి దూరం చేసిందని బాబు అన్నారు. పరిశ్రమలు తెస్తే వాటిని దూరం చేస్తారు.. క్రీడాకారులను దూరం చేస్తారు! అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఇక, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతు.. భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా? అని ప్రశ్నించా రు. విరిగిన చేతితో పాటు.. మోకాలి గాయంతో హనుమవిహారి ఆడారని, భారత్ జట్టు కోసం, మరీ ముఖ్యం గా ఆంధ్రా జట్టు కోసం తన క్రీడా శక్తినంతటినీ ధారపోశారన్నారు. ఈ రోజు ఒక వైసీపీ కార్పొరేటర్ కారణం గానే.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు విహారి తన కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక క్రికెటర్ కంటే.. రాజకీయ నాయకుడు ప్రధానమైపోయాడా? అనిప్రశ్నించారు.