వైసీపీ మహిళ నేత, ఫైర్ బ్రాండ్ మంత్రిగా పేరున్న రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో కొంతకాలంగా అసమ్మతి ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోజాకు రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయించేందుకు జగన్ కూడా సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది. అయితే, జగనన్న ఏం చెప్పినా చేస్తానని, టికెట్ వచ్చినా, రాకపోయినా వైసీపీతోనే తన ప్రయాణం అని రోజా పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలొనే తాజాగా మూడు ప్రభుత్వ భవనాలను రోజా వ్యతిరేక వర్గం నేత, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి రోజాకు సమాచారం లేకుండా స్వయంగా ప్రారంభించడంతో ఆమెకు అవమానం జరిగింది.
వాస్తవానికి వడమాల పేట మండలంలోని అప్పలాయగుంటలో సచివాలయం, పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్రం, జగనన్న పాల సేకరణ కేంద్రాలను రోజా త్వరలోనే ప్రారంభించాల్సి ఉంది. అయితే, రోజా కంటే ముందే తన పేరుతో శిలాఫలకాలు ఏర్పాటు చేసిన మురళీధర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వాటిని ఈరోజు ప్రారంభించారు. గతంలో కూడా పత్తిపుత్తూరు సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి రోజా ఏర్పాటు చేసుకోగా తన బిల్లులు ఇవ్వనిదే ప్రారంభం చేయకూడదు అంటూ మురళీధర్ రెడ్డి దానికి తాళం వేయడం సంచలనం రేపింది. ఇక, ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో కూడా రోజాకు వ్యతిరేకంగా జడ్పీటీసీ సభ్యులు నిరసన గళం వినిపించారు, రోజాకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే తాజాగా రోజా వ్యతిరేక వర్గానికి చెందిన నాయకుడు ఒకేసారి మూడు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడం, అధికారులు చూసి చూడనట్లుగా ఉండడం చర్చనీయాంశమైంది. రోజాపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే మురళీధర్ రెడ్డి వంటి నేతలు ఇలా ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిస్తున్నా సరే వైసీపీ అధిష్టానం చూసిచూడనట్లు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఓ రకంగా రోజాకు పొమ్మను లేక పొగ పెడుతున్నారని నగరి నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది.