ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కల్వకుంట్ల కవిత విషయంలో సీబీఐ రంగంలోకి దిగినట్లే ఉంది. కవితను విచారించటంలో ఈడీ ఫెయిలైందనే చెప్పాలి. అప్పుడెప్పుడో రెండురోజుల పాటు ఢిల్లీలో కవితను తన ఆపీసులోనే ఈడీ విచారించింది. తర్వాత నుండి కవితను విచారణకు పిలిపించటంలో ఈడీ ఫెయిలైందనే చెప్పాలి. ఎందుకంటే విచారణకు రమ్మని ఈడీ ఐదుసార్లు నోటీసులు జారీచేస్తే ఒక్కసారి కూడా హాజరుకాలేదు. పైగా మహిళలను ఈడీ విచారణకు తన ఆపీసుకు పిలిపించటం అన్యాయమని కవిత సుప్రింకోర్టులో కేసు వేశారు.
ఆ కేసు తేలేంతవరకు ఈడీ విచారణ విషయంలో అడుగు కూడా ముందుకు పడదని అందరికీ తెలిసిందే. వయసు అయిపోయిన వారిని, పిల్లలను, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారిని వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి విచారించాలని ఈడీ మాన్యువల్ లో ఉందట. దాన్ని అడ్డంపెట్టుకుని కవిత ఈడీ ఆఫీసుకు విచారణకు హాజరవ్వటానికి నిరాకరిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఈడీకి బదులుగా సీబీఐ రంగంలోకి దిగింది. ఈనెల 26వ తేదీన ఢిల్లీలోని తమ ఆపీసులో విచారణకు హాజరవ్వాలని నోటీసులో చెప్పింది.
లిక్కర్ స్కామ్ లో చివరిసారిగా 2022, డిసెంబర్ లో హైదరాబాద్ లోని కవిత ఇంట్లోనే సీబీఐ విచారించింది. మళ్ళీ ఇంతకాలం కవితను అసలు సీబీఐ టచ్ కూడా చేయలేదు. ఇంతకాలం విచారణ పేరుతో ఈడీనే నోటీసులు ఇస్తోంది. అలాంటిది సడెన్ గా కవితను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగటమే ఆశ్చర్యంగా ఉంది. ఈడీని కాదని సీబీఐ ఎందుకు రంగంలోకి దిగిందో అర్ధంకావటంలేదు.
ఈడీ విచారణకు హాజరుకాని కవిత 26వ తేదీన సీబీఐ విచారణకు హాజరవుతారా ? అన్నది పాయింట్. 26వ తేదీన విచారణకు గైర్హాజరవ్వటానికే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే విచారణకు హాజరయ్యే విషయంలో ఈడీకి వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేసినట్లే సీబీఐ విచారణ విషయంపైన కూడా కోర్టులో పిటీషన్ వేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే రెండు దర్యాప్తు సంస్ధలతో కవిత ఏకకాలంలో ఫైటింగ్ కు దిగినట్లే అనుకోవాలి. మరి చివరకు ఏమి జరుగుతుందనే విషయంలో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.