కేసీయార్ జోరు ఒక్కసారిగా తగ్గిపోయిందా ? అవుననే అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.
నల్గొండ బహిరంగసభ జరిగి నాలుగు రోజులైపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు కేసీయార్ చప్పుడు చేయలేదు.
అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి, మంత్రులు కేసీయార్ ను వ్యక్తిగతంగాను, పరిపాలనలో జరిగిన అవినీతిని, అక్రమాలను దుమ్ముదులిపేశారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీల్లోని అవినీతి, నిర్మాణ లోపాలను హైలైట్ చేస్తే పదేపదే మాటలతో కుళ్ళబొడిచారు.
దానికి జవాబుగా నల్గొండసభలో కేసీయార్ ఏదో చెప్పినా అదంతా ఫలితం ఇవ్వలేదు.
ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని అందుకు కేసీయార్, హరీష్ రావే ప్రధాన బాధ్యులనే విషయాన్ని రేవంత్, మంత్రలు జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు.
నిపుణులు, తాజాగా కాగ్ రిపోర్టులో కూడా కాళేశ్వరం, మేడిగడ్డతో పాటు సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలను ఎత్తిచూపింది.
వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని కాగ్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ అండ్ కో బాగా ఉపయోగించుకున్నారు.
నల్గొండ సభలో కేసీయార్ మాట్లాడుతు తన ఎంఎల్ఏలను తీసుకుని మేడిగడ్డ బ్యారేజిని సందర్శిస్తానని ప్రకటించారు.
ప్రకటించి నాలుగురోజులు అయినా ఇంతవరకు చప్పుడులేదు. మేడిగడ్డకు వెళ్ళకపోయినా కనీసం మీడియా సమావేశం కూడా నిర్వహించలేకపోయారు. పోని ఎంఎల్ఏలతో లేకపోతే పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహించలేదు.
నాలుగురోజులుగా కేసీయార్ ఏమిచేస్తున్నారో కూడా ఎవరికీ తెలీదని పార్టీవర్గాలే అంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవ్వటం కేసీయార్ ఇమేజి డ్యామేజి అయ్యిందనే ప్రచారం పెరిగిపోతోంది.
తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయన్న ఉత్సాహం కూడా పార్టీలో కనబడటంలేదు.
ఎంపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో కేసీయార్ ఏమి కసరత్తు చేస్తున్నారో కూడా ఎవరికీ తెలీదు. కేటీయార్, హరీష్ రావు కూడా చప్పుడు చేయకుండా కూర్చున్నారు.
ఇప్పటివరకు కేసీయార్ కు వ్యతిరేకంగా రేవంత్ అండ్ కో చేస్తున్న బ్యాటింగ్ ఏకపక్షంగా సాగిపోతోంది. దానికి ప్రతిగా కేసీయార్ అండ్ కో నుండి కనీసం ఎదురుదాడి కనబడటంలేదు.
అసెంబ్లీలో కేసీయార్ను, బీఆర్ఎస్ పాలనను సమర్ధించుకుంటు హరీష్ చేసిన ఒంటరిపోరాటం పెద్దగా ఫలితం ఇవ్వలేదు. మరీ పరిస్ధితుల్లో కేసీయార్ యాక్టివ్ అవ్వటంపైనే బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరి కేసీయార్ ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.