కాళేశ్వరం ప్రాజెక్టు కథ కంచికి చేరినట్లేనా ? అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడింది చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది.
ఇదే సమయంలో ప్రాజెక్టును అధ్యయనం చేసి నిపుణులు ఇచ్చిన రిపోర్టు కూడా దాదాపు అలాగే ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణమని అనేక అధ్యయనాల్లో బయటపడింది.
ఈ బ్యారేజీలో నీటిని నిల్వచేస్తే అపారమైన నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరించినట్లు మంత్రులు చెప్పారు.
ఎందుకంటే వర్షాలు, వరదలు లేనపుడు బ్యారేజికి చెందిన ఏడు పిల్లర్లు కుంగిపోయాయి.
ఇక భారీ వర్షాలు కురిసినప్పుడు నీటిని నిల్వచేస్తే బ్యారేజి తట్టుకోవటం కష్టమని నిపుణులు చెప్పినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
అందుకనే బ్యారేజిలోని నీటిని బయటకు పంపేశారు. మేడిగడ్డలో నీటి నిల్వ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగముండదు.
దీనికి అదనంగా అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల్లో కూడా పిల్లర్ల కింద పగుళ్ళ కారణంగా నీరు భారీగా లీకైపోతోంది.
అందుకనే వీటిల్లోని నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు వదిలేస్తున్నారు.
అంటే వేసవి కాలం మొదలయ్యే సమయానికి సాగు, తాగా నీటికి జనాలు ఇబ్బందులు పడక తప్పదనే సంకేతాలు కనబడతున్నాయి.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులకు రిపేర్లు చేయిస్తే కాని నీటిని నిల్వ చేసేందుకు లేదు.
ముందు రిపేర్లు చేసి తర్వాత నీటిని నిల్వచేస్తే కాని చేయించిన రిపేర్ల ఫలితం తేలదు.
అప్పటివరకు ప్రాజెక్టుల్లో నీరుండేందుకు అవకాశం లేదు. ఇదంతా చూసిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు కథ కంచికి చేరినట్లే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అందుకనే కాళేశ్వరానికి ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టు గురించి రేవంత్, మంత్రులు పదేపదే ప్రస్తావిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రాణహిత నిర్మించడం కూడా ఏమంత తేలికకాదట.
ఇపుడు సమస్య ఏమిటంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల నాణ్యతపై నిపుణులు రిపోర్టులు ఇచ్చేంతవరకు వీటిల్లో నీటిని నిల్వచేయలేరు. అలాగని వీటిని కూల్చేయలేరు.
వీటికి రిపేర్లుచేసినా ఎంతవరకు వర్కవుటవుతాయో నిపుణులు చెప్పలేకపోతున్నారు.
మొత్తం మీద సాగు, తాగు నీటి ప్రాజెక్టుల వ్యవహారం ఇంతటి వివాదంలో చిక్కుకోవటం నిజంగా దురదృష్టమని చెప్పాలి.