ఏపీ అధికారుల గురించి.. వారు కోర్టులకు, కోర్టుల ఆదేశాలకు ఎంత వాల్యూ ఇస్తున్నారనే విషయం చెప్పేందుకు గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా.. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు.. వైసీపీ జెండా రంగులు వేయడానికి వీల్లేదని.. హైకోర్టు ఆదేశించినా.. ఎవరూ ఖాతరు చేయలేదు. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని.. ఏకంగా ఈ విషయంపై హైకోర్టు మెట్లు ఎక్కి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఇక, ఎవరిని అరెస్టు చేయాలన్నా.. ముఖ్యంగా 7 ఏళ్ల జైలు శిక్ష కన్నా తక్కువ పడే సెక్షన్లలో సదరు వ్యక్తు లకు 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని.. హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. కానీ, వీటిని ఏమాత్రం పట్టించుకోకుండానే టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, రవీంద్ర వంటివారిని అరెస్టు చేశారు. ఈ సమయంలోనూ కోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపై ఏకంగా కోర్టు ఆదేశాల మేరకు అప్పటి డీజీపీగా ఉన్న ప్రస్తుత ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ కోర్టు మెట్లు ఎక్కారు.
ఇదీ.. వైసీపీ హయాంలో కోర్టులకు అధికారులు, ప్రభుత్వం ఇస్తున్న వాల్యూ. అయితే.. తాజాగా టీడీపీకి అనుకూలంగా `రాజధాని ఫైల్స్` పేరుతో తీసిన సినిమా విషయంలో మాత్రం.. చాలా అనూహ్యంగా వ్యవహరించారు. పైగా ప్రశ్నించిన వారికి.. కోర్టు ఆదేశాలు ఇచ్చింది.. అందుకే అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజధాని ఫైల్స్ పేరుతో అమరావతి వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే.. ఇది విడుదలకు ఒక్కరోజు ముందు.. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం సినిమా నిలుపుదలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే.. ఈ ఆదేశాలు వచ్చేందుకు సాయంత్రం 6 గంటల వరకు సమయం పడుతుంది. కానీ, ఇంతలోనే.. అధికారులు కోర్టు అలా ఆదేశాలు ఇచ్చిందో లేదో.. సినిమా హాళ్లపై విరుచుకుపడ్డారు. ఫస్ట్ షో.. సగంలో ఉండగానే నిలుపుదల చేసేశారు. దీంతో కృష్నాజిల్లా అవనిగడ్డ, మంగళగిరిలోని ధియేటర్లలో సినిమాలు సగంలోనే ఆగిపోయాయి. దీనిని ప్రేక్షకులు నిరసించారు. అయితే.. అధికారులు మాత్రం కోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని, కోర్టులను అందరూ గౌరవించాలని చెప్పడం గమనార్హం.