టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి.. తొలిసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. `నిజం గెలవాలి` పేరుతో.. ఆమె నిర్వహిస్తున్న యాత్రల గురించి తెలిసిందే. చంద్రబాబు జైలుకు వెళ్లారన్న వార్తలతో గుండెపగిలి చనిపోయిన టీడీపీ కార్యకర్తల ఇళ్లకు ఆమె వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు భరోసా ఇస్తూ.. ఆర్థికంగా కూడా.. ఆదుకుంటున్నారు. తాజాగా ఆమె నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు.
మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త జి. ముత్తప్ప కుటుంబా న్ని భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. బాధిత కుటుం బ సభ్యులకు రూ.3 లక్షలు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “ప్రతిపక్షం టీడీపీని, చంద్రబాబును అనేక ఇబ్బందులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం“ అని అన్నారు.
అంతేకాదు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన.. ఓట్ల జాబితాలో అవకతవకలను కూడా నారా భువనేశ్వరి ప్రస్తావించారు. ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఓట్లను వైసీపీ నేతలు తొలగిస్తున్నారని అన్నారు. ఇది వాస్తవం కాదా? అని ఆమె ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే మన ఆయుధమని ఇక్కడి వారికి తేల్చి చెప్పారు. ఈ ఐదేళ్లలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారన్న భువనేశ్వరి.. ఈ ప్రబుత్వాన్ని అధికారంలో నుంచి దించేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. ప్రజలు సంతోషంగా ఉండాలన్నా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. దీనికి మీరు చేయాల్సిన పని మీ ఓటును సైకిల్ గుర్తుకు వేయడమేనని నారా భువనేశ్వరి తెలిపారు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా.. వైసీపీ నాయకులు.. తమ జేబులు నింపుకొంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.