బాపట్ల జిల్లా అనమనమరులోని వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వైసీపీ ప్రభుత్వం రోడ్డేసింది. జగన్ చిన్నాన్న అయిన సుబ్బారెడ్డి పొలానికి వెళ్లే దారి కావడంతోనే దాదాపు 30 లక్షల ఉపాధి హామీ నిధులు ఖర్చుపెట్టి మరీ అధికారులు ఇటు హడావిడిగా రోడ్డు వేశారు. అయితే, ఆ పొలానికి సమీపంలో గత 12 సంవత్సరాల నుంచి ఉన్న పునరావాస కాలనీకి రోడ్డు వేయాలని ఈ ప్రభుత్వానికి అనిపించలేదు. ఆ కాలనీకి రోడ్డు వేస్తే వందలాది కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలిసినా…అధికారులు మాత్రం వైవీ సుబ్బారెడ్డి పొలానికి తారు రోడ్డు వేసేందుకే మొగ్గు చూపారు.
దీంతో, ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. బొంబాయ్ లో అంతే బొంబాయ్ లో అంతే అన్నరీతిలో…జగన్ హయాంలో అంతే…అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అది జనం కోసం జగన్ వేయింన తారు రోడ్డు కాదని…బాబాయి వైవీ సుబ్బారెడ్డి కోసం జగన్ బాబు వేయించిన వైవీ సుబ్బారోడ్డు అని సెటైర్లు వేస్తున్నారు. దీంతో, వైవీ సుబ్బారోడ్డు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాస్తవానికి జగన్ హయాంలో ఏపీలోని రోడ్ల దుస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరకు పలువురు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, జనసైనికులు పలుమార్లు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల గుంతల రోడ్లలో ప్రయాణించి ప్రమాదాలకు గురై ఆస్పత్రులపాలైన వారు కూడా ఉన్నారు. అయినా సరే జగన్ కు మాత్రం చీమ కుట్టినట్లు తేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.