తెలుగు దేశం యువ నేత నారా లోకేష్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ జనాల్లోకి అడుగు పెట్టాడు. యువగళం తర్వాత శంఖారావం పేరుతో ఆయన ఉత్తరాంధ్రలో పర్యటనలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా నరసన్న పేటలో మొదలైన శంఖారావం సభలో నారా లోకేష్.. జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ ఆసక్తికర ప్రసంగమే చేశాడు. సూటిగా సుత్తి లేకుండా జగన్ సర్కారు వైఫల్యాల్ని.. వైకాపా అధినేత నిర్ణయాలను తూర్పారబట్టారు నారా లోకేష్.
ముఖ్యంగా జగన్ ప్రవేశపెట్టిన కొత్త పథకం అంటూ ఆయన వేసిన మాస్ పంచ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అంటూ జగన్ కొత్త పథకం ప్రవేశ పెట్టారని.. ఇందులో భాగంగా ఒక చోట వేస్ట్ అనిపించుకున్న ఎమ్మెల్యేని మరో నియోజకవర్గానికి మారుస్తున్నాడని నారా లోకేష్ ఎద్దేవా చేశాడు. ఒక ఇంటి ముందు చెత్తను తీసుకెళ్లి ఇంకో ఇంటి ముందు వేస్తే అది చెత్తే అవుతుంది తప్ప బంగారం అవుతుందా అన్న లోకేష్.. ఒక నియోజకవర్గంలో పనికి రాడని జనాలు తేల్చేసిన ఎమ్మెల్యేను ఇంకో నియోజకవర్గానికి మారిస్తే అక్కడి జనం మాత్రం నమ్మి ఓట్లు వేస్తారా అని ప్రశ్నించాడు.
జగన్‌ను సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలే నమ్మట్లేదని.. మొన్న ఢిల్లీకి జగన్ వెళ్తే పార్టీలో ఉన్న 30 మంది ఎంపీల్లో ఆరుగురు మాత్రమే ఆయన వెంట ఉన్నారని.. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే బైబై జగన్ అంటున్నారని నారా లోకేష్ అన్నాడు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్న జగన్.. తన కేసుల కోసమే ఎంపీల బలాన్ని వాడుకున్నాడని.. అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తా అన్న జగన్ ఆ మాట తప్పి ఉద్యోగులను వేధించేలా జీపీఎస్ అంటూ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టాడని విమర్శించారు. జగన్ రోజూ ఏం తాగుతాడో తెలుసా అంటూ సభికులను ఉద్దేశించి అడుగుతూ ఆప్షన్లు ఇచ్చిన లోకేష్.. ఆయన రోజూ తాగేది ప్రజల రక్తం అంటూ పంచ్ వేశాడు.