ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ బరస్ట్ అయ్యాడు. అది కూడా అలా ఇలా కాదు. ఇటీవల కాలంలో మరే దర్శకుడు కానంత ఫైర్ అయ్యాడు కొందరి మీద. తన మీద గాసిప్స్ రాస్తునన వారిని ఉద్దేశించి ఓపెన్ డయాస్ మీద ఘాటుగా రియాక్టు అయ్యాడు. ‘‘షాడో ఇమేజ్ పెట్టి కాదు. దమ్ముంటే నా ఫోటో వేసి.. నిర్మాత ఇంట్లో తెల్లవార్లు మద్యం తాగాడని రాయ్’’ అంటూ ఫైర్ అయ్యాడు. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ మూవీ విడుదల కావటం.. దాని సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్ ‘ఈగల్’ మూవీసై వస్తున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. తనపై లేనిపోని వార్తలు రాస్తున్న వారిపై నిప్పులు చెరిగారు. తన మీద రాస్తున్న వాటికి సోర్స్ ఏమిటని ప్రశ్నించటమే కాదు.. ఇండస్ట్రీలో ఉన్నోళ్లంతా అన్నింటికి తెగించే ఉంటారన్నారు. తనపై ఏదైనా రాయాలనుకుంటే షాడో ఇమేజ్ పెట్టి రాయొద్దని.. దమ్ముంటే తన ఫోటో వేసి రాయాలని సవాల్ విసిరారు.
‘‘నాలుగు సంవత్సరాల నుంచి సినిమా లేదు. నిర్మాత ఇంట్లో కూర్చుని తెల్లవార్లు మద్యం తాగాడో డైరెక్టర్.. ఇతను పవన్ కల్యాణ్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు అంటే.. ఇంకెవరు?’’ అని ప్రశ్నించిన హరీశ్.. ‘‘మొత్తం రాసే ధైర్యం ఉండదు. ఒక షాడో ఇమేజ్ పెడతారు. రా.. దమ్ముంటే నా ఫోటో వేసి.. హరీశ్ శంకర్ తెల్లవార్లు తాగాడని రాయ్. నీ కౌంటర్ కు నేను కౌంటర్ వేస్తాను. నువ్వు ఏమైనా ఐస్ వేశావా? పెగ్ కలిపావా? ఏరా.. పెగ్ పట్టుకురా అంటే.. పెగ్ తెచ్చావా? ఎంట్రా నీ సోర్స్? పోనీ ఫోటో వేసి ధైర్యంగా రాస్తాడా? అంటే అదీ లేదు.
ఎంతకాలం ఇలా? రేపు మళ్లీ నా సినిమా గురించి రాస్తాడు’ అంటూ విరుచుకుపడ్డారు.
గ్యాప్ వచ్చిందని అంటారని.. తానిప్పుడు రెండు సినిమాలు చేస్తున్నట్లుగా ప్రకటించిన హరీశ్ శంకర్.. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్.. మిస్టర్ బచ్చన్ తో పాటు అతి త్వరలో పెద్ద హీరోలతో మరో రెండు సినిమాలు ప్రకటించబోతున్నా. ఇదేమన్నా ప్రోగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా ఫీజ్ కట్టావా? నేను ఏం చేస్తున్నానో నీకు చూపించటానికి? నాలుగు కాకపోతే ఐదేళ్లు కుదరదు. నీకు ప్రాబ్లమ్ ఏంటి? నీ ఇంటికి వచ్చిన ఏమైనా అడుతున్నానా? నా ఇంటికి అద్దె కట్టమని’’ అంటూ నిప్పులు చెరిగారు.
ట్రోలింగ్ తమకేం కొత్త కాదన్న హరీశ్.. సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పుడు తన తల్లిదండ్రులు.. బంధువులు మొదట ట్రోల్ చేశారన్నారు. ‘వీడేదో సినిమాలకు వెళ్లి ఏదో పీకుతాడట’ అంటూ ఇంట్లో వాళ్లు.. బంధువులు .. స్నేహితులు విపరీతంగా ట్రోల్ చేశారన్న హరీశ్.. ‘‘అయినా సినిమా పుట్టాకే వెబ్ సైట్స్ పుట్టాయ్. అంతే కానీ వెబ్ సైట్స్ పుట్టిన తర్వాతే సినిమా పుట్టలేదన్నది మర్చిపోవద్దు’’ అంటూ వ్యాఖ్యానించారు.
అన్నింటికి తెగించి.. ఎన్నో సౌకర్యాలు.. సుఖాలు త్యజించి.. ఇక్కడకు వచ్చి నిలబడ్డామన్న హరీశ్ శంకర్.. తాను అందరిని అనటం లేదన్నారు. ‘‘మళ్లీ అందరూ భుజాలు తడుముకోకండి. రేపు మా సినిమాలు వస్తాయి. రేపు మాపై నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తే చెప్పేది ఒక్కటే. మీరు అభిమానించే వ్యక్తే చెప్పాడు. అదేంటో అందరికీ తెలుసు అంటూ (వెంట్రుక కూడా పీకలేరన్న సైగతో చెప్పారు’ సీరియస్ అయ్యారు. హరీశ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సంచలనం కోసం, వైరల్ కావటం కోసం ఇష్టారాజ్యంగా రాసే వారికి లాగి పెట్టి ఒక్కటిచ్చినట్లుగా హరీశ్ శంకర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.