టాలీవుడ్ లో అలనాటి మేటి నటులలో మురళీ మోహన్ ఒకరు. టీడీపీ సీనియర్ నేతగా, సినీ నటుడిగా మురళీమోహన్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు 350 సినిమాల్లో నటించిన మురళీమోహన్ తాజాగా 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ‘ఎంఎంఎం’…మాగంటి మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ 5 దశాబ్దాల సినీ, రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ ‘తెలుగు నేల గౌరవం- తెలుగు సినీ గాండీవం’ అనే పాటను చంద్రబాబు ఆవిష్కరించారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ కు సాటి లేరని, దేశ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు ప్రశంసించారు. 350 సినిమాలో నటించిన మురళీమోహన్ టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తాను హైటెక్ సిటీ నిర్మించానని, ఆ పక్కనే జయభేరి ఎస్టేట్స్ పేరుతో బ్రహ్మాండంగా ఆయన నిర్మాణాలు చేపట్టారని గుర్తు చేసుకున్నారు.
తానూ, వెంకయ్య నాయుడు ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చామని, 1984లో ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని పట్టుబట్టిన వారిలో వెంకయ్య నాయుడు ఒకరని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పదవులకు, తెలుగు జాతికి వన్నె తెచ్చిన వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ లభించడం తెలుగు జాతికే గర్వకారణం అని కొనియాడారు. ఇక, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త నిర్వచనం చెప్పిన పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం సంతోషకరమన్నారు.