హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులు ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు గత కొంతకాలంగా నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్నారని, దానివల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై కళాశాల ఇన్చార్జి మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంఎస్ యుఐ కార్యకర్తలు, విద్యార్థులు ధర్నాకు దిగడంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. తాము తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఇక, లేడీస్ హాస్టల్ దగ్గర పురుషులను సెక్యూరిటీ గార్డులుగా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం నాణ్యమైన విద్య, మంచి భోజనం అందించడం లేదని ఆరోపించారు.
ఫిబ్రవరి 7వ తేదీన భోజనంలో బొద్దింక, బల్లి పడి విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై గురువారం నాడు కూడా విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. మరి, ఈ వ్యవహారంపై మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.