కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్ష మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని నిర్దేశించారు.
ఆ నాలుగు రోజులు కనీసంగా 24లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అవసరమైన వ్యాక్సిన్ డోసులు కేంద్రాన్ని కోరాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఎన్నికలు ముగిసినందున వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్న సీఎం.. దీని కోసం అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. టీకా ఉత్సవ్ విజయవంతం చేశాక మరిన్ని డోసులు తెప్పించుకో వడంపై దృష్టిపెట్టాలన్నారు.
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కొవిడ్ వ్యాక్సిన్‌పై సమీక్షించిన సీఎం ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఇప్పుడు దేశంలోనే టీకా కొరత ఏర్పడిందనేది నిజం. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా చూచాయగా చెప్పేస్తోంది.
ఇప్పటి వరకు తొలి డోస్ వేసిన వారికి రెండో డోస్ ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. టీకాను వృథా చేయడం మానేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలను హెచ్చరించారు.
అంటే.. దీనిని బట్టి దేశంలో టీకా కొరత పెరిగిపోయిందనే విషయం అర్ధమైంది. ఇక, ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా విదేశాలకు పంపుతున్న టీకాను తక్షణమే ఆపు చేయాలని.. దేశంలోని ప్రజలను కాపాడాలని.. ప్రధాని నరేంద్ర మోడీకి హెచ్చరిస్తున్నట్టుగానే విజ్ఞప్తి చేశారు.
ఇక, మహారాష్ట్రలోనూ టీకా కొరత ఉందని.. కాబట్టి తీవ్రమైన కరోనా సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే టీకా ఇస్తామని.. అక్కడి ప్రభుత్వం ప్రకటించేందుకు రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోనూ టీకా కొరత వెంటాడుతోందని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు టీకా కొరతతో అల్లాడుతుంటూ.. ఇక్కడ ఏపీలో మాత్రం సీఎం జగన్.. రోజుకు ఆరు లక్షలమందికి టీకా ఇవ్వాలని.. ఇస్తామని ప్రచారం చేసుకోవడం ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇది అధికారులపై ఒత్తిడి పెంచడంతోపాటు.. ప్రజలను కూడా ఒక గందరగోళ పరిస్థితిలోకి నెట్టేసే చర్యే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవాలు మరిచి ఊరేగితే.. ఇప్పుడు ఖజానా కొల్లబోతున్నట్టే.. రేపు ప్రజారోగ్యం కూడా మునిగిపోతుందని హెచ్చరిస్తున్నారు.
పైగా కేంద్రం నుంచి టీకాను తీసుకువచ్చే బాధ్యతను అధికారుల నెత్తిన రుద్దేస్తే.. సీఎంగా జగన్ ఏం చేస్తున్నారనే ప్రశ్నకూడా వస్తోంది. టీకా అవసరమైన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే నేరుగా కేంద్రానికి ఇండెంట్ పెడుతున్నారు. అయినా.. టీకా లభించని పరిస్థితి నెలకొంది.
ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సీఎం జగన్ ఇలాంటి ప్రకటనలతో ప్రజలను మాయ చేయడం సరికాదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.