టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో మరో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు బుట్టదాఖలు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం చార్జిషీట్‌కు అనుమతి లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఏపీ సీఐడీ అధికారులు కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేయగా.. దీనిని పరిశీలించిన కోర్టు వెంటనే తిరస్కరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
చార్జిషీట్లో ఏముంది?
ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన చార్జిషీట్లో.. కీలకమైన విషయాలు పేర్కొన్నారు. అమరావతి రింగు రోడ్డు వ్యవహారం ముందుగానే తెలుసుకుని.. దీని చుట్టుపక్కల స్థలాలు కొనుగోలు చేశారని. ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందని ఏపీ సీఐడీ పేర్కొంది. దీనిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, వ్యాపార వేత్త లింగమనేని రమేష్, పార్టీ నేత రాజశేఖర్, టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ లు కీలకమని ఏపీ సీఐడీ పేర్కొంది.
శుక్రవారం ఈ కేసుపై జరిగిన విచారణలో సీఐడీ చార్జ్‌షీట్‌ను కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని స్పష్టం చేసింది. చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. గతంలోనూ ఎలాంటి అనుమతి లేకుండా.. కేసును దాఖలు చేశారంటూ.. సెక్షన్ 17 వర్తిస్తుందని కోర్టు తెలిపింది. దీంతో ఒక సారి వెనక్కి తీసుకున్న సీఐడీ అధికారులు.. మరోసారి కూడా ఎలాంటి పాఠం నేర్వకుండానే ఆదరాబాదరాగా చార్జిషీట్‌ను ఉద్దేశ పూర్వకంగా దాఖలు చేయడం గమనార్హం. మరి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుంటారో లేదో చూడాలి.