ఆంధ్రప్రదేశ్‌లో గత 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యాత్ర సినిమాతో బాగానే ప్రయోజనం పొందింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను ఉద్వేగభరితంగా తీర్చిదిద్దడం.. ఆయనలోని హ్యూమన్ యాంగిల్‌ను బాగా ఎలివేట్ చేయడం ద్వారా జనాల్లో ఎమోషన్ తీసుకొచ్చి వైసీపీ పట్ల సానుకూలతను పెంచడంలో దర్శకుడు మహి.వి.రాఘవ్ విజయవంతం అయ్యాడు.
ఇప్పుడు అతనే యాత్రకు కొనసాగింపుగా యాత్ర-2 తీశాడు. ఈసారి కథను జగన్ చుట్టూ నడిపాడు. ఐతే చనిపోయిన వ్యక్తి, పైగా గొప్ప ఇమేజ్ అయిన నాయకుడి మీద బయోపిక్ చూస్తే కలిగే అనుభూతి వేరు. అలా కాకుండా బతికే ఉంటూ ముఖ్యమంత్రిగా అధికారం అనుభవిస్తున్న వ్యక్తి మీద సినిమా చూడటం వేరు. ఇది ‘యాత్ర-2’కు ఉన్న మైనస్.
గురువారం రిలీజైన ‘యాత్ర-2’ చూసిన జగన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ రావడం ఖాయం. కానీ పూర్తి ఏకపక్షంగా సాగుతూ.. జగన్‌ను మించిన ఉత్తమ రాజకీయ నేత లేనట్లు, అవతలి వాళ్లందరూ దుర్మార్గులు అన్నట్లు చిత్రీకరించిన ఈ సినిమా ఆయన వ్యతిరేకులకు ఎంతమాత్రం రుచించే అవకాశం లేదు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా అసహ్యించుకుంటున్నారు ఆ సీన్లలను. ఇంక సొంత వాళ్లకు డబ్బా అనిపించినా వారికి తప్పదు.
ఇందులో చూపించిన చాలా సన్నివేశాలు జనాలకు అనేక సందేహాలు రేకెత్తించే అవకాశముంది. అన్నింటికీ మించి జగన్ మాట తప్పడు, మడమ తిప్పడు అన్నట్లు.. అమలు చేయలేని హామీ అస్సలే ఇవ్వడన్నట్లు ఇందులో చూపించారు. 2014 ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇస్తే గెలిచే అవకాశమున్నా అది అమలు చేయలేని హామీ కావడంతో ముందు ఓకే అని కూడా తర్వాత జగన్ వెనక్కి తగ్గినట్లు చూపించారు. కానీ 2019లో ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలు ఇచ్చాడు జగన్.
కట్ చేస్తే అవన్నీ నీటి మీద రాతలు అయ్యాయి. మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, ఏటా జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా, రాజధానిగా అమరావతి కొనసాగింపు.. ఇలా ఎన్నో ముఖ్యమైన హామీల విషయంలో జగన్ అధికారంలోకి రాగానే చేతులెత్తేశాడు. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తుండగా.. 2014 నాటి రుణమాఫీ హామీ మీద జగన్ వెనక్కి తగ్గి అధికారం కోల్పోయినట్లు చూపించడం విడ్డూరం. ఇది జగన్‌కు మేలు కంటే చేటే ఎక్కువ చేస్తుందని.. న్యూట్రల్ జనాలు ఈ సన్నివేశం చూసి జగన్ పట్ల వ్యతిరేకత పెంచుకునే అవకాశాలే ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.